శ్రీ శారదామాత జీవితచరిత్ర పార్ట్ 22

🌻🌻🌻🌻🌻🌻🌻

🌸శ్రీ మాత్రే నమః🌸

🌺 *_శ్రీ శారదామాత జీవితచరిత్ర_* 🌺

      2⃣2⃣ *వ రోజు* 

 *శారదామాత కుటుంబం:-* 

🌻🌻🌻🌻🌻🌻🌻

ఇంటికి జ్యేష్ఠురాలు మాతృదేవి. ఆమె తరువాత జన్మించిన ఏకైక సోదరి కాదంబిని. వివాహంచేసుకొన్న కొంతకాలానికే మరణించింది. ఆమెకు సంతానం కలుగలేదు. కాదంబిని తర్వాత ప్రసన్న కుమార్, ఉమేశ చంద్ర, కాళీ కుమార్, వరద ప్రసన్న, అభయచరణ్ అనే ఐదుగురు సోదరులు జన్మించారు. 

వీరిలో ఉమేష్ తన పద్దెనిమిదవ ఏట మరణించాడు. ప్రసన్నుని భార్య రాంప్రియాదేవి. వారికి నళిని, సుశీలా (మాకూ) కుమార్తెలు. రాంప్రియాదేవి చనిపోయాక ప్రసన్నుడు సువాసినీదేవిని వివాహం చేసుకొన్నాడు. వారికి కమల, విమల అని ఇద్దరుకుమార్తెలు, గణపతి' అనే కుమారుడు పుట్టారు. కాళీకుమార్ సుబోధ్ బాలదేవిని వివాహం చేసుకుని భూదేవ్, రాధారమణులనే కుమారులకు తండ్రి అయ్యాడు. అభయచరణ్ భార్య సురబాల; వీరికి ఏకైక పుత్రిక రాధారాణి, ముద్దుగా రాధూ అనీ రాధీ అని ఈమెను పిలిచేవారు. ఈమె మాతృదేవి భవిష్యత్ జీవితంలో ముఖ్య భూమిక పోషించింది. తల్లితండ్రులు, సోదరులు, బంధువులు అంటూ కుటుంబంలో ప్రతి ఒక్కరి శ్రేయస్సులోనూ మాతృదేవి ఎంతో శ్రద్ధ చూపించారు.

మాతృదేవి దక్షిణేశ్వరంలో జీవించిన పదమూడేళ్లలో ఏడు సార్లయినా
జయరాంబాటికి వెళ్లి కొంతకాలం గడిపివచ్చారు. ఏప్రిల్ 26, 1874లో మాతృదేవి తండ్రియైన రామచంద్ర పరమపదించారు. ఆయన మరణం మాతృదేవి కుటుంబాన్ని దారిద్ర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే కుటుంబ పోషణ ఆయన పైనే ఆధారపడిఉంది కనుక. పొలం మీద వచ్చే కొద్దిపాటి రాబడి కూడా వ్యవసాయాన్ని చూసుకోవడానికి సరైన వ్యక్తి లేనందు తగ్గిపోయింది. నలుగురు తమ్ముళ్లూ బాగా చిన్నవారు. అందువల్ల కుటుంబ భారమంతా భర్తను కోల్పోయిన శ్యామసుందరి మీద పడింది.కానీ ఆమె కుంగిపోలేదు. సమీపంలోని బెనర్జీ కుటుంబం వారికి వడ్లు దంచి ఇవ్వడం, వంటపని చేయడంతో సంపాదించిన డబ్బుతో కుటుంబం గడపసాగారు. పిల్లల చదువు పాడవ కూడదని, వారిలో ముగ్గురిని తన బంధువు ఇళ్లకు పంపించారు. ఆ బంధువులు పిల్లల చదువు బాధ్యతలను తీసుకున్నారు.

ఇలాంటి శోకమయ కాలఘట్టంలో మాతృదేవి తమ తల్లికి ఎంతో చేదోడు వాదోడుగా నిలబడ్డారు. భర్తను కోల్పోయిన తల్లికి అండగా ఉంటూ, ఆమెను ఓదారుస్తూ, వడ్లు దంచడం లాంటి కాయకష్టపు పనులలో పాలుపంచుకుని ఇంటి సంపాదనను పెంచడానికి సాయపడ్డారు. 

క్రమేణా పరిస్థితులు కొంతలో కొంత చక్కబడ్డాయి. ప్రసన్న చదువు పూర్తిచేసి కలకత్తాకు వెళ్లి పౌరోహిత్యం చేస్తూ కొంత సంపాదించసాగాడు. కాళీ, వరద పొలం పనులు చూసుకోసాగారు. అందరికన్నా చిన్నవాడూ బుద్ధిమంతుడూ అయిన అభయ్ కొందరు మిత్రుల సహాయంతో వైద్య విద్య కోసం కలకత్తాకు వెళ్లాడు. చదువును పూర్తిచేసిన అభయ్ దురదృష్టవశాత్తు యుక్తవయస్సులోనే అకాల మరణం చెందాడు. తన సోదరులను మాతృదేవి ఎంతగానో ప్రేమించారు. ఆమె అండదండలతో పెరిగిన ఆ సోదరులు, పెద్దవారయ్యాక కూడా ఆమె
సహాయసహకారాలను ఆశించారు.

జగత్తును ధరిస్తున్న *జగద్దాత్రీదేవిని* ఆరాధించడం కూడా కుటుంబంలో తాండవిస్తున్న దారిద్రం తొలగిపోవడానికి ఒక కారణమయింది. ఆ సంవత్సరం కాళీపూజ వచ్చింది. పేదరికం కారణంగా శ్యామాదేవి ఇంట్లో కాళీ పూజ జరుపుకోలేకపోయింది.【ఈ పూజ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, ఇతరులు 
ఒక బృందంగా ఏర్పడి జరుపుకుంటారు. పేదవారు వస్తువులనో,డబ్బునో ఇస్తారు 】.' అందువల్ల ఆ ఊళ్ళో నవముఖర్జీ అనే వ్యక్తి జరిపిన పూజకు తనవంతుగా కొంత బియ్యం, మరికొన్ని పదార్థాలను తీసుకెళ్లి ఇచ్చారు. ఇంత
పేదరికంలోనూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆమె వీటిని సేకరించి పెట్టుకున్నారు. కానీ శ్యామాదేవి కుటుంబంతో ఏర్పడ్డ చిన్న మనస్తాపం కారణంగా ఆ వస్తువులను తీసుకోవడానికి నవముఖర్జీ
నిరాకరించాడు. శ్యామాదేవి మనస్సు క్షోభించింది. 

ఆ రాత్రి ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది. అందులో ఎరుపు మేనిఛాయ గల ఒక దేవి దర్శనమిచ్చింది. కాలు మీద కాలు వేసుకుని తలుపు దగ్గర కూర్చొని వున్న ఆ దేవి, శ్యామాదేవితో, "నువ్వెందుకు ఏడుస్తున్నావు? కలత చెందకు! నువ్వు కాళి కోసం సేకరించిన వాటిని నేను స్వీకరిస్తాను” అని చెప్పింది. మహదానందంతో శ్యామాదేవి, "అవును, నువ్వెవరివి?” అని అడిగింది. *“నేను జగతిని ధరించే జగద్ధాత్రిని"* అది దేవి. ఇంతలో కల చెదిరిపోయింది.

తెల్లవారగానే ఆమె మాతృదేవిని పిలిచి, “శారదా! కాలుమీద కాలువేసుకుని ఎరుపు మేని ఛాయతో దర్శనమిచ్చే ఆ దేవి ఎవరు?” అని అడిగింది. అందుకు మాతృదేవి, “జగద్ధాత్రి" అని టక్కున చెప్పారు. "నేను మన ఇంట్లో జగద్భాతి పూజ చేయబోతున్నాను” అంటూ అందుకోసం ఏర్పాట్లు చేయసాగారు. ఎలాగో శ్రమపడి, అప్పు చేసి, పూజ కోసం ఏర్పాటు చేశారు. ' 

ప్రసన్న  దక్షిణేశ్వరం వెళ్లి గురుదేవులను పూజలో పాల్గొనమని ప్రార్థించాడు. గురుదేవులు అమితానందంతో, *"ఓహో! దేవి వస్తున్నదా! రానివ్వు రానివ్వు! చాలా మంచిది నేను అక్కడ ఉన్నట్లే పూజలన్నీ జరుగుగాక! అది కుటుంబానికి శ్రేయస్సును చేకూరుస్తుంది”* అని చెప్పి ప్రసన్నుని పంపించేశారు. ఆయన పూజకు రాలేదు. నిశ్చయించిన రోజున పూజ చక్కగా జరిగింది.

🌻🌻🌻🌻🌻🌻🌻

🌺శ్రీ శారదామాత చరితామృతం🌺

🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

భగవద్గీత అంటే ఏమిటి