శారదామాత జీవితచరిత్ర పార్ట్ 24
🌻🌻🌻🌻🌻🌻🌻
*_🌹శారదామాత జీవితచరిత్ర_ 🌹*
2⃣4⃣ *వ రోజు*
*హృదయ్ అహం - పర్యవసానం* *:-*
🌻🌻🌻🌻🌻🌻🌻
జయరాంబాటి నుండి 1881 మార్చిలో దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు మాతృదేవి. అప్పుడు హృదయ్ అహంకారం వల్ల
మాతృదేవి మనస్సు క్షోభించే సంఘటన ఒకటి జరిగింది.
గురుదేవుల సాధన సమయంలో నీడలా ఆయన వెంటే ఉంటూ సేవలు చేసినవాడు *హృదయ్*.(గురుదేవుల అన్న కొడుకు) అందువల్ల ఆలయ సిబ్బంది, ఇతరులు అతడి పట్ల ఎంతో మర్యాద కనబరచేవారు. ఇది అతడి మనస్సులో అహంకారాన్ని రేకెత్తించింది. తన సహాయం లేనిదే గురుదేవుడు కూడా ఏమీ చేయలేరనే గర్వంతోనూ, అహంకారంతోనూ విర్రవీగ సాగాడు హృదయ్. ధనాశతో అతడు గురుదేవుల దర్శనార్ధం వచ్చే వారందరికీ తనను ఒక గొప్ప మహాత్మునిగా ప్రదర్శించుకోసాగాడు. కరుకుతనమూ, అందరూ తనకు లోబడి ఉండాలనే గర్వంతో విఱ్ఱవీగిన హృదయ్ ఇతరులను అల్పంగా మాట్లాడడం, వారి మనస్సులు బాధపడేలా చేయడం లాంటివి చేయసాగాడు.
గురుదేవులు కూడా ఈ దుర్భరత నుండి తప్పించుకోలేకపోయారు. ఆయనను అజమాయిషీ చేయడమే కాకుండా, గద్దించడం, భయపెట్టడం పలువురి సమక్షంలో లోకువచేసి మాట్లాడడం, దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆతడికి గురుదేవుల పట్ల ఉన్న ప్రేమ, భక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
మార్వాడీ భక్తుడైన లక్ష్మీనారాయణ ఇవ్వాలనుకున్న పదివేల రూపాయలు గురుదేవులు నిరాకరించడంతో అతడిలో ఏవగింపు, అసంతృప్తి పెరిగిపోయాయి. ఇందువల్ల ఆయనను పలు రకాలుగా విధించడంతో పాటు పలువురి సమక్షంలో ఎగతాళి చేయడం కూడా మొదలు పెట్టాడు. తమ ఆధ్యాత్మిక సాధనల సమయంలో అతడు చేసిన సేవలను మనస్సులో ఉంచుకున్న గురుదేవులు హద్దు మీరిన హృదయ్ అవకతవక లన్నిటినీ మౌనంగా సహించారు. ఇలాంటి సందర్భంలోనే మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చారు. అప్పుడు హృదయ్ ప్రవర్తించిన తీరు గురించి మాతృదేవి ఇలా చెప్పారు.
నేను దక్షిణేశ్వరం వచ్చినప్పుడు లక్ష్మితో పాటు మా అమ్మ ఇంకా పలువురు స్త్రీలు కూడా వచ్చారు. మమ్మల్ని చూడగానే హృదయ్ అసహ్యంతో, "మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీకు ఇక్కడ పనేమిటి?" అని అరుస్తూ హేళనగా మాట్లాడసాగాడు. మా అమ్మా, ఆతడూ ఒకే గ్రామానికి చెందినవారు. ఎలాంటి కారణమూ లేకుండా మా అమ్మను లోకువచేసి మాట్లాడాడు. దాంతో ఎంతో బాధపడ్డ మాఅమ్మ, "మనం తిరిగి వెళ్లిపోదాం. ఇక్కడ ఎవరివద్ద నా కుమార్తెను వదిలి వెళ్లను?" అంది ఆవేదనతో. గురుదేవుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. హృదయకు భయపడ్డ ఆయన మమ్మల్ని ఉండమనో, వెళ్లిపోమనో ఒక్కమాట కూడా చెప్పలేదు. ఆయన మౌనాన్ని చూసి మేం మరో మార్గంలేక ఆ రోజే జయరాంబాటికి బయలుదేరాం. బయలుదేరడానికి ముందు నేను కాళీమాతతో, “అమ్మా! నేను ఇక్కడికి రావాలని నువ్వు ఎప్పుడు సంకల్పిస్తావో అప్పుడు వస్తాను” అంటూ మనసులో నిశ్చయించుకొని బయలుదేరాను. గురుదేవులు ఎందుకిలా ప్రవర్తించారో అర్థంకాదు. హృదయ్ కోర్కెకు విరుద్ధంగా మాతృదేవీ, ఇతరులూ అక్కడ ఉండడం జరిగితే వారందరితోనూ చీటికీమాటికీ దెబ్బలాడుతూ, వారిని అతడు బాధిస్తాడు. ఇంతకంటే వారు తిరిగి వెళ్లిపోవడమే నయమని ఆయన భావించివుండవచ్చు.
మాతృదేవి తిరిగి వెళ్లిపోయిన కొద్ది రోజుల లోపునే, మధుర బాబు కుమారుడైన త్రైలోక్యుని కుమార్తెను పూజించిన తప్పిదానికై హృదయ్ కు దక్షిణేశ్వరం నుండి ఉద్వాసన జరిగింది.
【 కారణం వంగదేశంలో బాలికలను దేవీ స్వరూపంగా ఆరాధించే సంప్రదాయంఉంది. ధనాశపట్టిన హృదయ్, త్రైలోక్యుని ఆదరాభిమానాలను పొందడానికి ఒక రోజు అతడి కుమార్తెనే ఆరాధించాడు. ఈ విషయం తెలుసుకొన్న త్రైలోక్యుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆతడు బెస్తకులస్థుడు. కానీ హృదయ్ బ్రాహ్మణుడు. ఉన్నత కులస్థులు నిమ్నకుల బాలికను ఆరాధిస్తే ఆ బాలిక యువ ప్రాయంలో వితంతువవుతుందని నమ్మకం. అందువల్ల త్రైలోక్యుడు తక్షణమే హృదయకు పూజారి పదవి నుండి ఉద్వాసన ఇచ్చి, కాళికాలయం వైపే కాలుమోపరాదని హెచ్చరించి వెళ్లగొట్టారు.
మాతృదేవిని అవమానించిన కొద్ది కాలానికే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన తర్వాత హృదయ్ పరిస్థితి ఎంతో శోచనీయంగా పరిణమించింది. జీవితంలో అనుభవించలేని దుఃఖాన్ని అనుభవించాడు. అప్పుడు తను మాతృదేవి పట్ల ప్రవర్తించిన అసభ్యకరమైన ప్రవర్తనకూ, ఆమెను అవమానించినందుకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. *"నన్ను* *అవమానిస్తే బహుశా ఎలాంటి శాస్తి లేకుండా* *తప్పించుకోగలవేమో! కానీ* *ఆమెను అవమానించిన వారు* *అందుకు తగిన శాస్తిని అనుభవించే తీరాలి"* అని మునుపు గురుదేవులు చెప్పిన మాటలు అక్షర సత్యం. 】
ఆ తర్వాత హృదయ్ చేస్తూవున్న పనులన్నీ రామ్ లాల్ కు అప్పజెప్పారు. పదవి రాగానే అతడు కూడా విర్రవీగసాగాడు, "నేను కాళికాలయం పూజారిని" అంటూ గర్వంతో
గురుదేవులను అశ్రద్ధ చేయసాగాడు.
ఆయనను చూసుకొంటూ నియమిత సమయాలలో ఆహారం పెట్టడానికి ఆతడు తటపటాయించాడు. గురుదేవులు అప్పుడప్పుడు పారవశ్య స్థితులలో నిమగ్నులవుతూ ఆహారాది విషయాలను విస్మరిస్తారు. ఆ సమయాలలో ఆయనను శ్రద్దగా కనిపెట్టి ఆహారం ఇవ్వాలి. రాంలాల్ ఈ పని చేయలేదు. అందువల్ల ఆహారం, సరైన సమాయానికి అందించేవారు లేకపోవడంతో, ఆయన ఆరోగ్యం పాడవసాగింది.
అందువల్ల గ్రామానికి వెళ్లేవారితో మాతృదేవిని రమ్మని గురుదేవులు కబురు పంపించారు. "నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను. పూజారిగా నియమితుడయ్యాక రామ్ లాల్, ఇతర పూజారులతో కలిసిమెలసిపోయి నావైపు తిరిగికూడా చూడడం లేదు. కనుక దయచేసి నువ్వు సత్వరమే ఇక్కడకు రావడం మంచిది. మామూలు పల్లకీ లేదా కప్పు వున్న పల్లకీ లేదా ఏ వాహనం దొరికినా వెంటనే బయలుదేరి రావలసింది! అంటూ మాతృదేవికి కబురు పంపారు.తరువాత మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ శారదామాత చరితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment