శారదామాత జీవితచరిత్ర పార్టీ 26

🌻🌻🌻🌻🌻🌻🌻
🌸శ్రీ మాత్రే నమః🌸
 
🌺 *_శారదామాత జీవితచరిత్ర_
* 🌺

2⃣6⃣ *వ రోజు* 

 *శ్యాంపుకూర్ లో గురుదేవుల సేవ :-* 
🌻🌻🌻🌻🌻🌻🌻
సుఖం వస్తే దుఃఖం కూడా దానిని వెంబడించే వస్తుంది. ఇదే నియమం. ఈ చక్రభ్రమణం నుండి ఎవరు తప్పించుకోలేరు. అందువల్లనే జ్ఞానులు సుఖ దుఃఖాలు రెండింటినీ త్యజించి వాటికి అతీతమైన స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రజల శ్రేయస్సు కోసం జన్మ స్వీకరించి, ప్రజల మధ్య జీవిస్తూన్న అవతార పురుషులు మానవుల్లా సుఖదుఃఖాలను స్వీకరించవలసి వుంది. 

1885 వ సం|| శీతకాల ప్రారంభంలో మాతృదేవి జీవితంలో మొట్టమొదటిసారిగా ఆవేదన తన ఎరుకను చూపించింది. ఏప్రిల్ నెల మధ్యలో గురుదేవులకు గొంతులో నొప్పి మొదలయింది. క్రమంగా ఎక్కువైన ఆ నొప్పి ఎటువంటి చికిత్సలకూ ఉపశమించక తీవ్రం కాసాగింది. సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి నొప్పితోపాటు గొంతు నుండి రక్తం కూడా స్రవించసాగింది. అందువల్ల భక్తులు ఆయనను కలకత్తాకు తరలించి చికిత్స చేయించాలని తీర్మానించారు. 

1885 సెప్టెంబరులో ఆయనను దక్షిణేశ్వరం నుండి శ్యాంపుకూర్ కు తీసుకువెళ్లారు. గురుదేవుల వ్యాధిని గురించి మనసులో ఎంతో బాధపడుతూ మాతృదేవి శోకమూర్తిగా దక్షిణేశ్వరంలో ఒంటరిగా ఉండిపోయారు. గురుదేవులు శ్యాంపుకూర్ వెళ్లిన తర్వాత మాతృదేవి ఎక్కువ రోజులు దక్షిణేశ్వరంలో ఉండలేదు. గురుదేవులను కలకత్తాకు తీసుకువెళ్లి చికిత్స ప్రారంభించినప్పుడు ఆయనకు ఆవశ్యకమయిన పథ్యాహారం తయారుచేయడానికీ, వేళకు సరిగ్గా ఆయనకు ఆహారం ఇవ్వడానికి మాతృదేవి సహాయం ఎంతో అవసరమయింది.

కాని శ్యాంపుకూర్లో గురుదేవులు బసచేసిన అద్దె ఇంట్లో స్త్రీలు ఉండడానికి ప్రత్యేకంగా గదులేవీ లేవు. ఇంటి నిండా భక్తులు ఎప్పుడూ ఉండేవారు. స్వతహాగా  లజ్జాస్వరూపిణి అయినా మాతృదేవి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ బస చేయడానికి సమ్మతిస్తారా అని భక్తులు సందిగ్ధంలో పడ్డారు. ఈ విషయంగా గురుదేవులను సంప్రదించినప్పుడు, "ఆమె ఇక్కడికి వచ్చి ఉండగలుగుతుందా? ఆమెని అడిగి చూడండి. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకొన్న తర్వాత ఆమె ఇక్కడకు వచ్చి ఉండడానికి ఇష్టపడితే రమ్మనండి" అన్నారు. దక్షిణేశ్వరానికి మాతృదేవి వద్దకు మనిషిని పంపించారు.

 *ఎప్పుడు ఎలాగో అప్పుడు అలా, ఎక్కడ ఎలాగో అక్కడ అలా, ఎవరితో ఎలాగో వారితో అలా'* అనేవారు గురుదేవులు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి. అలా జీవించడం సాధ్యపడకపోతే ప్రశాంతతను పొందడమో, జీవిత లక్ష్యాన్ని చేరుకోవడమో అసంభవమవుతుంది. ఈ ఉపదేశానుసారం తమ జీవితాన్ని అమర్చుకోగల పాఠాన్ని ఆమె నేర్చుకున్నారు. అందువల్ల తమ ఇబ్బందులను గురించి కాస్త కూడా పట్టించుకోకుండా శ్యాంపుకూర్ కు వచ్చి సంతోషంతో ఆ బాధ్యతను స్వీకరించారు.

అపరిచితులైన పురుషులు ఉంటున్న ఇంట్లో అన్ని అసౌకర్యాలనూ సహించుకొంటూ తమ బాధ్యతను నెరవేర్చసాగారు మాతృదేవి. అక్కడ ఒకటే స్నానాల గది ఉండేది. అందువల్ల తెల్లవారుజాము మూడు గంటలకు మునుపే ఎప్పుడు లేచి కాలకృత్యాలు తీర్చుకుంటారో, తర్వాత రెండవ అంతస్తులో ఉండే మరుగైన చోటికి ఎప్పుడు వెళతారో ఎవరికీ తెలియదు. పగలంతా అక్కడే ఉండేవారు. గురుదేవులకు ఆవశ్యకమయిన ఆహారం వండేవారు. తర్వాత వృద్ధుడైన పెద్ద గోపాల్ లేక లాటు ద్వారా కబురు పంపేవారు. గురుదేవుల ప్రక్కన ఉండేవారు వెళ్లిపోయారంటే, ఆమె ఆహారం కిందకు తీసుకువచ్చి ఇచ్చేవారు. లేకపోతే భక్తులు తీసుకువచ్చి ఇచ్చేవారు. తర్వాత మాతృదేవి కూడా ఏదో నాలుగు మెతుకులు తిని అక్కడ విశ్రమించేవారు. అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి సుమారు పదకొండు గంటలకు కిందకి దిగివచ్చి తమకు కేటాయించిన గదిలో రాత్రి రెండు గంటల దాకా నిద్రించేవారు. గురుదేవుల వ్యాధి నయమవ్వాలనే ఏకైక ధ్యేయంతో ఆమె నిత్యం ఇలా గడిపారు. అక్కడికి నిత్యం వచ్చే వారిలో అనేకులకు అలాంటి ఒక వ్యక్తి అక్కడ ఉంటూ, గురుదేవులకు ముఖ్యమయిన సేవ చేస్తూ ఉండడం తెలియదు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ శారదామాత చరితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

భగవద్గీత అంటే ఏమిటి