శారదామాత జీవితచరిత్ర🌹 Part 30

🌻🌻🌻🌻🌻🌻🌻

🌸శ్రీ మాత్రే నమః🌸

 *🌹శారదామాత జీవితచరిత్ర🌹* 

3⃣0⃣ *వ రోజు* 

 *గురుదేవుల మహాసమాది :-* 

 *ఆగస్టు 15.* 
🌻🌻🌻🌻🌻🌻

ఎముకల గూడులా అయిపోయారు గురుదేవులు. ఆయన కొన్ని తలదిండ్లను ఉంచుకుని వాటిపై ఆనుకొని వున్నారు. సర్వతా నిశ్శబ్దం అందరిలోనూ విశ్వాసపు  చివరి పగ్గం కూడా సడలిపోతూవుంది. ఆయన మాట్లాడలేకపోతున్నారే అనిపించింది. ఆ రోజంతా మాతృదేవికి శకునాలు సరిగ్గా లేవు. కిచ్చడి వండుతూ ఉంటే అది క్రింద మాడిపోయింది. మేడమీద ఆరవేసిన 
గుడ్డలు కనబడలేదు. నీటితో నిండిన కుండలు పైకెత్తారు. అది కిందపడి ముక్కలు ముక్కలయింది. ఎంతో కలతచెంది లక్ష్మీతోపాటు గురుదేవుల గదికి వచ్చారు. 

అప్పుడు గురుదేవులు, "ఇదిగో చూడు, ఎక్కడ చూసినా జలమయంగావుంది. ఆ జలం మధ్యగా నేను ఎక్కడికో సుదూరంగా వెళుతున్నట్లుంది"అన్నారు. ఇక ఆపుకోలేక మాతృదేవి రోదించసాగారు. గురుదేవులు మళ్లీ, 'కలత చెందకు! ఇప్పుడు ఉన్నట్లే ఇకపై కూడా, ఉండబోతున్నావు. నన్ను చూసుకొన్నట్లే వీళ్లందరు (నరేంద్రాదులు) నిన్ను కూడా చూసుకుంటారు. లక్ష్మిని చూసుకో” అన్నారు.

ఆ రోజు అర్ధరాత్రి అందరి హృదయాలను దుఃఖంతో నింపివేసి గురుదేవులు మహాసమాధి చెందారు. మాతృదేవి అప్పుడు ప్రక్కన లేరు. విషయం తెలియగానే పరుపు దగ్గరికి వచ్చి, "అమ్మా! ఖాళీ! నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు?"అంటూ ఆక్రోశించారు. అందరి హృదయాలూ ద్రవించిపోయాయి. గురుదేవుల బౌతిక శరీరం కాశీపూర్ శ్మశానవాటికలో అగ్నికి ఆహుతి చేయబడింది. అస్తులను(అస్తికలు) ఒక ఇత్తడి బిందెలో సేకరించి గురుదేవులు శయనించిన పరుపుమీద ఉంచారు.

 *ముప్పై మూడు ఏళ్ల* మాతృదేవి వితంతువుగా తన్ను చేసుకున్నారు. భర్త చనిపోతేనే కదా భార్య వితంతవుగా మారాలి! ఆమె భర్త మరణించారా? మరణాతీతులు కదా గురుదేవులు! మాతృదేవి తన బంగారు గాజులను తీసివేయడానికి ప్రయత్నించగానే గురుదేవులు ఆమెకు సాక్షాత్కరించారు. "నేను చనిపోయాననా నువ్వు ఈ సుమంగళీ రూపాన్ని తీసేస్తున్నావు! నేను చనిపోలేదు. ఇదిగో ఇక్కడే ఉన్నాను” అంటూ మాతృదేవి ప్రయత్నాన్ని వారించారు. మండు టెండలో వీచే ఆహ్లాదకరమైన గాలిలా వచ్చిన గురుదేవుల దర్శనం, మాటలూ మాతృదేవి దుఃఖపూరితమైన మనస్సుకు ఎంతో 
ఊరటను కలుగజేశాయి. 

అంచులేని తెల్లటి చీర నొకదానిని మాతృదేవికి *బలరాంబోస్* తీసుకువచ్చాడు. దానిని *గోలాప్ మాకు* ఇస్తూ మాతృదేవికి ఇవ్వమన్నాడు. "తెల్లచీరను నేనివ్వడమా?" అంటే ఆవేదనతో అరిచింది గోలాప్ మా. కానీ ఆ చీరను ఆమె మాతృదేవి వద్దకు తీసుకువెళ్లినప్పుడు, అప్పటికే
మాతృదేవి తాము ధరించిన చీరలోని విశాలమయిన ఎరుపు అంచులు భాగాన్ని
చింపివేసి, సన్నని అంచు మాత్రం గల చీరను ధరించి ఉన్నారు.

అలసి సొలసి పోయిన క్షణాల్లో కనబడి అనునయించడానికి నిష్క్రమించినా
నిష్క్రమించని భర్త ఉన్నారు; నోరారా 'అమ్మా' అంటూ పిలవడానికి పిల్లలున్నారు. లోకంలో జీవించడానికి ఇవి చాలవు కదా! ప్రపంచ దృష్టిలో తానొక వితంతువు. ఇక బిడ్డలా, చిల్లిగవ్వలేని సన్నాసులు! 'నా తర్వాత నువ్వు కామార్పుకూరుకు (అత్తగారిఊరు) వెళ్లి, జీవించు, సామాన్య ఆహారాదులతో సాధారణ జీవితం గడుపు. ఎవరి నుండి దేన్నీ ఆశించకు'. అని చెప్పి, కావలసిన డబ్బుకు కూడా తగిన ఏర్పాట్లు చేసి వెళ్ళిన ఆ ప్రేమమూర్తి మధుర స్మృతులు మాతృదేవిని విపరీతంగా వేధించాయి. 'ఆయన లేకుండా నేను జీవించి తీరాలా?' కానీ గురుదేవులు అప్పగించిన కార్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లాలి? నూతన సన్యాస సంప్రదాయానికి అధ్యక్షురాలుగా, మాతృత్వపు ఔన్నత్యాన్ని లోకానికి చాటిచెప్పిన మాతృదేవిగా చేయవలసిన మహోన్నత కార్యాన్ని వదలి ఎక్కడి వెళ్లాలి? ఆ తర్వాత  మాతృదేవి సందిగ్ధత చెందలేదు. ఆలోచనలు స్పష్టమయ్యాయి. తాము జీవించి తీరాలనే తీర్మానానికి వచ్చారు మాతృదేవి.

మాతృదేవి మనోవేదనలు ఒక వైపు ఉండగా, మరోవైపు గురుదేవుల భక్తులు కొందరు తమ వంతుగా ఆవేదనను రగిల్చేలా ప్రవర్తించారు. గురుదేవుల నిర్యాణానంతరం *కాశీపూర్ ఇంటిని* ఖాళీ చేయడానికి వారు పూనుకున్నారు. కానీ నరేంద్రుడు, ఇతర మాతృదేవి సన్న్యాస పుత్రులు వెంటనే ఇంటిని ఖాళీ చేసి
మాతృదేవిని అక్కడ నుండి తీసుకెళ్లడం ఆమెకు ఎంతో ఆవేదనను కలుగజేస్తుందని వారించారు. కొన్ని రోజుల వరకైనా ఆమె అక్కడే ఉండడానికి ఏర్పాటు చేయాలనీ, అవసరమైతే తాను బిచ్చమెత్తి మాతృదేవిని పోషించగలమని చెప్పారు. అందువల్ల మరికొన్ని రోజులు మాతృదేవి కాశీపూర్ ఇంట్లోనే గడిపారు. 

 *గురుదేవుల అస్తులున్న కలశం* ప్రతిరోజూ నైవేద్యంతోపాటు పూజింపబడుతూ వచ్చింది. కానీ ఇల్లు ఖాళీ చేయాలని భక్తులు పట్టుపట్టారు. అందువలన ఐదు రోజుల తర్వాత బలరాంబోసు ఆహ్వానంపై *ఆగస్టు 21వ* తేది మాతృదేవి, లక్ష్మితోపాటు వారింటికి వెళ్లారు. మాతృదేవి మౌనంగా అన్నిటినీ సహించారు.

ఇంతలో గురుదేవుల అస్తుల కలశాన్ని ఎవరి బాధ్యతలో ఉంచాలనే విషయం మీద సన్యాస శిష్యులకూ, గృహస్థ శిష్యులకూ భేదాభిప్రాయం తలెత్తింది. ఆపై మాతృదేవి ఓర్చుకోలేకపోయారు. "చూడు గోలాప్! అంతటి మహానుభావుణ్ణి కోల్పోయి కూర్చున్నాం! ఇక్కడ వీరందరూ ఆయన అస్తుల కోసం కొట్టుకుంటున్నారు" అంటూ ఆవేదనతో అన్నారు.

తర్జనభర్జనల తర్వాత కలకత్తా పొలిమేరలలోని *కాంకూర్ గాచ్చి* అనే చోట రామచంద్రునికి సొంతమయిన తోటలో అస్తులను పదిలపరచి ఒక దేవాలయం నిర్మించడానికి భక్తులు తీర్మానించారు. గురుదేవులు ఒకసారి ఈ తోటకు వెళ్లి ఉండడం, వారి ఈ తీర్మానానికి ఒక కారణం. కాని సన్నాసి శిష్యులు ఇందుకు సమ్మతించలేదు. అందువల్ల అస్తులలో చాలా భాగం ప్రత్యేకంగా తీసి బలరాంబాబు ఇంటికి మాతృదేవి వెళ్లినప్పుడు ఇచ్చి పంపి అక్కడ సంప్రదాయానుసారం ఆరాధన చేయడానికి ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో గంగాతీరంలో స్థలం కొనుగోలుచేసి గురుదేవులకు అక్కడ చక్కని దేవాలయం నిర్మించాలన్నదే వారి ఆశయం. మిగిలిన అస్తులు కృష్ణజన్మాష్టమి రోజు సంప్రదాయానుసారంగా కాంకూర్ గాచ్చికి తీసుకుపోయారు. *శశి* ఈ అస్తుల కలశాన్ని తన తల మీద ఉంచుకుని వెళ్లాడు. సన్యాస శిష్యులూ, భక్తులు వారితో వెళ్లారు. కాంకూర్ గాచ్చిలో వాటిని ఉంచి దేవాలయం నిర్మించి సంప్రదాయానుసారం ప్రతి రోజు పూజలు జరగడానికి ఏర్పాట్లు చేశారు.

తాను మధురంగా గడపిన రోజులు ముగింపుకు వచ్చాయని మాతృదేవి గ్రహించారు. ఇక తమ మహత్తర కార్యం పూర్తి అయ్యేదాకా గురుదేవుల పరికరంగా జీవించాలి. తమను పూర్తిగా ఆయనకు అర్పించుకొని బలరాంబాబు ఇంట రోజులు వెళ్ల బుచ్చసాగారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

భగవద్గీత అంటే ఏమిటి