శారదామాత జీవితచరిత్ర🌹 Part 33

🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ మాత్రే నమః🌺

🌹 శారదామాత జీవితచరిత్ర🌹

3⃣3⃣ *వ రోజు* 

 *దారిద్ర్య దుర్భరత :--* 
🌻🌻🌻🌻🌻🌻🌻
దక్షిణేశ్వరం నుండి బయలుదేరిన మాతృదేవి *బర్ద్వాన్* వరకు అందరూ రైలులో పయనించారు. అంత దూరం వెళ్లడానికి సరిపడ డబ్బు మాత్రమే ఉంది. ఆ  తర్వాత కాలినడకే. మొదటి ఘట్టంగా *పదహారు మైళ్లు* నడచి *ఉచ్చలన్* అనే చోటికి చేరుకున్నారు. మాతృదేవి బాగా అలసి పోయారు. అందువల్ల అక్కడ కొంత విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే వంట చేసుకొని భోజనంచేసి పిదప అందరూ కలిసి కామార్పుకూర్ చేరుకున్నారు. గోలాప్ మా తప్ప తక్కిన వారందరూ మాతృదేవితో పాటు మూడు రోజులుండి కలకత్తాకు తిరిగి వెళ్లపోయారు. గోలాప్ మా ఒక నెల రోజులు అక్కడ గగిపారు.

ఆనాటి సమాజం వితంతువుకు గౌరవాన్ని, అంతస్తును కల్పించడానికి తయారై లేదు. వితంతువుకు ఎటువంటి వినోదాలు నిషిద్ధం. ఆమెను ఒక జీవచ్ఛవంలా చూసేవారు. గ్రామాలలో ఈ నియమాలు మరీ విపరీతం. ఇక్కడ ఒక వితంతువు - పూర్తిగా తెలుపు రంగు చీర కాక అందులో ఎర్రని అంచు చీర ధరించడం, చేతులకున్న బంగారు గాజులు తీసివేయకపోవడం గ్రామస్థులకు ఇంతకన్నా మరేం కావాలి? సానుభూతి కలగడానికి బదులుగా కోపమూ, ఉక్రోషమూ కలిగి మాతృదేవిని, *'ఉల్లాస వితంతువు'* అంటూ చిన్నబుచ్చి మాట్లాడుకోసాగారు. మాతృదేవితో నెలరోజులు ఉన్న గోలాప్ మా గ్రామ ప్రజల అవహేళనలు మాతృదేవిని సమీపించకుండా జాగ్రత్త వహించింది. ఆమె వెళ్లిపోవడమే ఆలస్యం, గ్రామస్థులు తమ ఏవగింపును నానారకాలుగా వెలిబుచ్చారు. ఏం చేయాలో తోచక మాతృదేవి కలత చెందారు.

కానీ జయరాంబాటిలో ఒక *భాను అత్తలా* , కామార్పుకూర్ లో, మాతృదేవికి ఎంతో స్వాంతన నిచ్చిన వ్యక్తి *ప్రసన్నమయి.* చిన్నతనంలోనే గురుదేవులను భగవంతునిగా ఎంచి ఆరాధించిన వ్యక్తి ఈమె. వృద్ధురాలైన ఆమె కూడా ఒక వితంతువు. ఆమె భక్తి, పవిత్ర జీవితం గ్రామస్థులకు ఆమె పట్ల గౌరవాన్ని కలిగించాయి. మాతృదేవిని దూషించిన గ్రామ ప్రజలతో ఆమె *"గదాయ్ భార్య"* సామాన్యమైన స్త్రీ కాదు. "గదాయ్ లా ఈమె కూడా దైవమే" అంటూ పలు విధాలుగా నచ్చజెప్పింది. ఆమె మాటలు విన్న తర్వాత గ్రామ ప్రజల ధోరణి పూర్తిగా మారకపోయినా కొంతలో కొంత మారింది.

ప్రసన్నమయితో పాటు కామార్పుకూర్ లో, మాతృదేవికి అండగా నిలిచింది *ధనీ* అనే వృద్దురాలు. ఆమె కూడా మాతృదేవిని తన ప్రాణంగా ప్రేమిస్తూ ఆమెకు అండగా నిలిచింది.

 *(* ధనీ గురుదేవుల జీవితంలో శాశ్వతంగా చోటు చేసుకున్న వ్యక్తి. గురుదేవుల తల్లి అయిన చంద్రమణికి సన్నిహితురాలైన వ్యక్తి. చిన్నతనంలోనే వితంతువయిన ఆమె చంద్రమణి ఇంటికి సమీపంలో నివసిస్తున్న *కమ్మరి కుమార్తె.* శివుని అనుగ్రహంతో చంద్రమణి గర్భం ధరించి మూర్ఛ పోయినప్పుడు ఆమెతో ఉండి సాయపడింది. గురుదేవులు ఈ ఇలలో జన్మించగానే వారిని తమ చేతులలో తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి, తమ ఉపనయన సమయంలో బ్రాహ్మణుల వద్ద నుండి మాత్రమే ప్రథమ భిక్షను తీసుకునే సంప్రదాయాన్ని త్రోసివేసి, గురుదేవులు ఈమె వద్దనే *మొదటి భిక్ష* పుచ్చుకొన్నారు. అలా చూస్తే ధని గురుదేవులకు మరొక తల్లి అవుతుంది. కామార్పుకూర్లో ధని ఇల్లు ఉండిన చోట ప్రస్తుతం ఆమెకోసం ఒక చిన్న ఆలయం కట్టబడింది. *)* 

మాతృదేవి వద్ద చిల్లి గవ్వకూడా లేదు. కాసిని ధాన్యం ఉంది. ఆ ధాన్యాన్ని దంచి, దానిని వండి అన్నం మాత్రం గురుదేవులకు నైవేద్యంగా అర్పించేవారు. తాము కూడా అదే తినేవారు. తర్వాత ఒక రోజు తామే ఒక గునపం తీసుకుని తోటను బాగుచేసి తోటకూర విత్తనాలు చల్లారు. ఈ తోటకూర పెరిగే దాకా కేవలం ఒట్టి అన్నం మాత్రమే తిన్నారు. అందులో కలుపుకోవడానికి కావలసిన ఉప్పు కొనడానికి కూడా డబ్బు లేదు. ధరించిన దుస్తులు చిరిగిపోతే వాటిని ముడివేసి ధరించసాగారు. దారిద్ర్యం ఆమెను ఎంతగా బాధించిందో తెలుస్తూనే ఉంది కదా! 

సమాజం కట్టుబాట్ల కారణంగా గ్రామస్థులు మాతృదేవిని దూషించారంటే, బంధువులు అంతకంటే ఒక మెట్టు పైకెక్కి ఆమెను ఛీత్కరించారు. ఒక వితంతువు సుమంగళిలా జీవించగోరుతున్నదనే కారణం వల్లనో, లేకపోతే గ్రామస్థులు తమను కూడా వెలివేస్తారనే భయంతోనో బంధుగణం ఇలా ప్రవర్తించిందో తెలియరాలేదు. ఏకాకియైన మాతృదేవికి తోడునీడగా ఉండవలసిన వారు గురుదేవుల అన్న *రామేశ్వరుని* సంతానమైన లక్ష్మి ,రామ్ లాల్, శివరాములు. కానీ దక్షిణేశ్వర కాళికాలయ ప్రధాన పూజారియైన రామ్ లాల్ ఎలాంటి సహాయం చేయకపోవడమే కాక, మాతృదేవికి ప్రతి నెలా వచ్చే *ఏడు రూపాయలను* కూడా ఆపించేసిన ప్రబుద్ధుడు. శివరాం మాతృదేవి పట్ల ఎంతో ఆప్యాయత చూపారు. ఉపనయనం తర్వాత ప్రధమ భిక్షను మాతృదేవి నుండే స్వీకరించాడు. కానీ మాతృదేవికి ఎలాంటి సహాయము చేయలేని నిస్సహాయ స్థితిలో ఆతడున్నాడు. ఆతడు తన అన్నతో దక్షిణేశ్వర్ లో ఉన్నాడు. లక్ష్మి కూడా సోదరులతో పాటు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది.

ఒకసారి దక్షిణేశ్వరం నుండి వచ్చిన రామ్ లాల్ తనతోపాటు నలుగురు బంధువులను తోడ్కొని వచ్చి కుటుంబ ఆస్తిపాస్తులను త్వరత్వరగా పంపకం చేసి, మాతృదేవి వాటాగా గురుదేవులు జన్మించిన చిన్న *గుడిసెను* అప్పజెపి,
కులదైవమైన రఘువీరుని పూజకు, నైవేద్యానికి ఏర్పాట్లు చేసి తిరిగి వెళ్లిపోయారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ శారదామాత చరితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

భగవద్గీత అంటే ఏమిటి