శారదామాత జీవితచరిత్ర🌹 Part 35

🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ మాత్రే నమః🌺

🌹 *శారదామాత జీవితచరిత్ర🌹

3⃣5⃣ *వ రోజు* 

 *భక్తుల అభ్యర్థన :--* 
🌻🌻🌻🌻🌻🌻🌻
గురుదేవుల నిర్యాణానంతరం మాతృదేవి *ముప్పైమూడేళ్లు* జీవించారు.
 *"కామార్పుకూర్ లోని, నీ* *సొంత ఇంటిని వదలి* *వేయకు”* అంటూ  గురుదేవులు చెప్పిన మాటలను ఆమె మరచిపోలేదు. ఆయన చెప్పినట్లే నివసిస్తూ తపోమయ జీవితం గడపాలనేదే ఆమె ఆశయం. కానీ పరిస్థితులు పూర్తిగా ప్రతికూలమయినందున అక్కణ్ణుండి కలకత్తా వెళ్లవలసి వచ్చింది. కొన్ని విషయాలలో గురుదేవులు చెప్పింది యధాతధంగా మాతృదేవి స్వీకరించేవారు కాదు. అలాంటి కొన్ని సంఘటనలు చూద్దాం.

దక్షిణేశ్వరంలో కొంతమంది యువకులు గురుదేవుల దగ్గరకు వచ్చి రాత్రి సమయాల్లో కూడా ధ్యాన జపాదులు అనుష్టించసాగారు. రాత్రి ఎక్కువ ఆహారం తీసుకోవడం సాధనా జీవితానికి అవరోధం అని గురుదేవులు వారి వారి శక్తికి తగ్గట్లు ఇన్నీ చపాతీలే తినాలని నియమం పెట్టారు. ఒక భక్తుణ్ణి “నువ్వు రాత్రిపూట ఎన్ని చపాతీలు తింటావు?" అని అడిగారు.

ఐదో, ఆరో" అన్నాడు. 

“చాలా ఎక్కువ. ఎందుకు అన్ని తింటావు?" అని మళ్లీ అడిగారు. 

అందుకు ఆ భక్తుడు మాతృదేవి పెట్టింది పెట్టినట్లే తింటున్నట్లు చెప్పాడు. వెంటనే నహబత్తుకు వెళ్లారు గురుదేవులు. మాతృదేవిని పిలిచి, అలా వారందరికీ మితం లేకుండా ఆహారం ఇస్తే, వారి ఆధ్యాత్మిక జీవితానికి అవరోధం కలుగుతుందని నిలదీశారు. అందుకు మాతృదేవి, "రెండు చపాతీలు ఎక్కువ తిన్నాడని ఎందుకు ఇంతగా కలత చెందుతారు? ఈ విషయానికి మీరు ఇంత ప్రాధాన్యమివ్వకండి. *వారందరి బాగోగులు నేను చూసుకుంటాను”* అన్నారు గంభీరంగా.

ఎవరు ఏది చెప్పినా అట్లే స్వీకరించేవారుకారు గురుదేవులు. మాతృదేవి వారి బాగోగులను చూసుకోగలుగుతారని గ్రహించినందువల్లనే, ఆ మాటలను అలాగే తీసుకొని, మరొక మాట చెప్పకుండా అక్కడ నుండి వెళ్లిపోయారు.

గురుదేవులు అనేక విషయాలలో మాతృదేవిని సంప్రదించేవారు. ఆయన అడిగిన వెంటనే మాతృదేవి తమ అభిప్రాయం చెప్పేవారు కారు. మాతృదేవి, “కాస్త అవకాశమివ్వండి, కాసేపటి తరువాత చెబుతాను” అనేవారు. అందుకు గురుదేవులు, “అదేమిటి! ఇప్పుడే ఎందుకు చెప్పకూడదు? ఎవరితో కలిసి ఆలోచిస్తావు?" అంటూ అడిగేవారు. అప్పుడు కూడా మాతృదేవి, "క్షమించండి. నేను కాస్త ఆలోచించి, ఆ విషయంగా మీతో మాట్లాడతాను” అని చెప్పేవారు. తర్వాత తిన్నగా నహబత్తుకు వచ్చి దేవితో, *"అమ్మా నేనేమి చెప్పాలో దయచేసి వెల్లడించు తల్లీ!"* అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థించేవారు. ప్రార్ధన మూలంగా పొందిన జవాబు గురుదేవులతో చెప్పేవారు.

కాలాంతరంలో ఒక సందర్భంలో యోగీన్ మా మాతృదేవితో, “అమ్మా! కొన్ని సమయాల్లో గురుదేవుల సలహాలను సైతం పాటించక దృఢంగా ఉండిపోయారు కదా! అది ఎలానమ్మా?" అని అడిగింది. 

అందుకు మాతృదేవి చిరునవ్వుతో, "యోగీన్! ప్రతి విషయంలోనూ మరొకరికి తలొగ్గి నడవడం సాధ్యమయ్యేపనేనా?” అంటూ బదులు చెప్పారు. 

మరొక సందర్భంలో వైవాహిక జీవితం గూర్చి చెబుతూ, 'కాలమంతా పూర్తిగా ఒక వ్యక్తికి తలవొగ్గి నడుస్తూ, ఆతడి బలహీనతలనన్నిటికీ తాళం వేస్తూగడిపే జీవితం, జీవిత అవుతుందా?" అని అన్నారు. 

అందువల్ల భర్తకు తగినభార్యగా మాతృదేవి జీవితం గడిపారు అని చెప్పినప్పుడు, భర్త ఏది చెప్పినా, ఆలోచనారహితంగా దానిని తు.చ. తప్పక పాటించారు అని అర్థం కాదు. గురుదేవులు కూడా దానిని ఆకాంక్షించలేదు. "ఇది గురుదేవుల ఆజ్ఞ కాదు. ఇలాంటి జీవితాన్ని మాతృదేవి అనుసరించవచ్చు అని మాత్రం సూచించారు".

గురుదేవులు మాతృదేవికి భర్త మాత్రమే కాకుండా, గురువు కూడా. అయినప్పటికీ ఆయన చెప్పారు కదా అని దేనినీ మాతృదేవి అట్లే స్వీకరించలేదు. అదేసమయంలో, తాను ఎందుకు అలా చేశాను అని వివరించడానికి కూడా ప్రయత్నించలేదు. అయినా మృదుత్త్వమనే ఉపకరణం ద్వారానే తమ స్థితి గురుదేవులకు అర్ధమయ్యేలా చేసేవారు.

కామార్పుకూర్ లో ఇలాంటి  కఠోర తపొజీవితం ఆవశ్యకం లేదని గురుదేవులు కూడా అనుకున్నారేమో! గురుదేవుల సన్యాస శిష్యులు, భక్తుల అభ్యర్థన మేరకు  మాతృదేవి కలకత్తా వెళ్లారు. తల్లి(మాతృదేవి) కష్టపడుతూ ఉంటే బిడ్డలు (శిష్యులు,భక్తులు) చూస్తూ ఉండగలరా!
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ శారదామాత చరితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

భగవద్గీత అంటే ఏమిటి