శారదామాత జీవితచరిత్ర🌹 Part 36

🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ మాత్రే నమః🌺

🌹 *శారదామాత జీవితచరిత్ర🌹

3⃣6⃣ *వ రోజు* 

 *సంఘ జనని :--* 
🌻🌻🌻🌻🌻🌻🌻
గురుదేవుల నిర్యాణానంతరం ఆయన సన్యాస శిష్యులు వరాహ నగరంలో ఒక పాడుపడిన ఇంట్లో ఉంటూ తపోమయ జీవితం గడుపసాగారు. పిశాచాలు సైతం దరిజేరడానికి  శంకించే తపోమయ జీవితం గడుపుతున్నారు.

1887 జనవరి నెలలో వారు హోమాగ్నిని రగిలించి, విధివిహితంగా సన్యాసం స్వీకరించారు. కానీ ఒక సంఘంగా కలిసి పనిచేయాలనే ఆలోచన అప్పట్లో వారికి లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాలలో తపోమయ జీవితం అంటూ మొదలు పెట్టారు. వారందరూ సంఘంగా కలిసి జీవించాలి అనే ఆలోచనా బీజం మాతృదేవి చలువే.

సన్యాస శిష్యులు వరాహ నగరంలో తపస్సు చేసుకుంటున్న అదే సమయంలో మాతృదేవి కామార్పుకూర్లో తపోజీవితం గడుపుతున్నారు. గయకి వెళ్లి మరణించిన తన తల్లికి పిండ ప్రదానం చేయమని గురుదేవులు ఒకసారి మాతృదేవితో చెప్పారు. అందుకోసం 1890 మార్చి 25వ తేది మాతృదేవి పెద్దగోపాల్ తో గయకు వెళ్లారు. తర్వాత అక్కడ నుండి బుద్ధగయకు వెళ్లారు.

బుద్ధ గయలో మాతృదేవి ఒక ప్రసిద్ధ మఠాన్ని చూడడం తటస్థించింది. ఆ తరంలో చక్కని వసతులు ఉన్నాయి. భోజనానికి, ఇతర అవసరాలకు చక్కని ఏర్పాట్లు చేయబడివున్నాయి. దీనిని చూసిన మాతృదేవి మనసులో ఆవేదనతో కూడిన ఒక దృశ్యం కళ్లముందు నిలిచింది. 

గురుదేవులనే నమ్ముకుని, వారినే దైవంగా భావించి తమ చదువును, సుఖసంపదలను, బంధుగణాన్ని తోసి వచ్చిన ఆయన శిష్యులయిన తమ బిడ్డలు దేశమంతటా సంచరిస్తున్నారు. ఈ దృశ్యం మాతృదేవి కళ్లలో నీళ్లు నింపాయి. తన బిడ్డలకు కూడా ఇలాంటి మఠాలు ఏర్పడాలని మాతృ హృదయం పరితపించగా, కన్నీరు మున్నీరుగా ప్రార్థించారు మాతృదేవి. ఆ ప్రార్థనే *ప్రస్తుత రామకృష్ణ మఠాలన్నిటికీ మూలమయింది.* 

ఈ విషయంగా మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారు. “ఓ! ఇందుకోసమే నేను గురుదేవులను ఎంతగా కన్నీళ్లతో ప్రార్థించానో తెలుసా? ఆ తరువాతే ఆయన కృపాకటాక్షం వల్ల ఈ మఠం (బేలూరు మఠం) రూపుదిద్దుకుంది.
గురుదేవుల నిర్యాణం తర్వాత ఆయన  శిష్యులు తమ ఇళ్లను త్యజించి ఒక అద్దె ఇంట్లో నివసించసాగారు. పిదప తపోజీవితం గడుపుతూ, ఏకాకులై అక్కడికీ, ఇక్కడికి అలమటించసాగారు. మీ పేరిట సర్వస్వమూ త్యజించిన నా బిడ్డలు తిండి కోసం బిచ్చమెత్తుకోవడం నేను భరించలేకపోతున్నాను. 

మీకు నా ప్రార్థన ఇదే: మీ పేరు చెప్పుకుని లోకాన్ని త్యజించే వారికి సాధారణమైన కూడు గుడ్డ నీడ లభించాలి. వారందరూ మీ ఉపదేశాలనూ, ఆదర్శాలనూ కేంద్రంగా చేసుకుని ఒక చోట కలసికట్టుగా నివసించాలి. ప్రాపంచిక జీవితంలో దుఃఖాలననుభవించే ప్రజలు, వారిని ఆశ్రయించి, వచనా మృతాన్ని గ్రోలి ఊరడింపు పొందాలి. అందుకోసమే కదా మీ అవతరణ! వారందరూ అలమటిస్తూ తిరగడం నేను సహించలేను' అని ప్రార్థించారు. ఆ తరువాత నరేంద్రుడు క్రమేణా ఇవన్నిటినీ రూపొందించాడు.

గురుదేవులు తమ యువ శిష్యులను సన్యాసులను భిక్ష తీసుకురావాలని ఆదేశించినప్పుడు, *ప్రథమ భిక్ష* వారికందరికీ ఇస్తూ, రామకృష్ణ సంఘానికి శ్రీకారం చుట్టారు మాతృదేవి. 

ఇప్పుడు తమ ప్రార్థన మూలంగా సంఘం రూపుదిద్దడం కూడా మాతృదేవి చేశారు. ఇంతే కాదు, ఉద్యమ వ్యాప్తిలోని ప్రతి ముందంజకూ మాతృదేవియే మార్గదర్శకురాలయ్యారు. అందువల్లనే ఆమెను *'సంఘ జనని'* అంటే సంఘానికి తల్లిగా ఆరాధిస్తున్నారు.(మాతృదేవిని 'సంఘ జనని' అంటూ మొట్టమొదట పేర్కొన్నది *స్వామీజీయే* (స్వామి వివేకానంద). 1897 లో రామకృష్ణ మిషన్ ను స్థాపించిన అదే సమావేశంలో దీనిని ప్రకటించారు స్వామీజీ.) 

చరిత్ర కనీవినీ ఎరుగని గురుదేవుల తపస్సువల్ల సంఘం ఆవిర్భవించింది. మాతృదేవి తపస్సుతో అది అంకురించి పెరగడం మొదలు పెట్టింది. దానిని లోకానికే నీడ నిచ్చే మహావృక్షంగా తీర్చిదిద్దే బాధ్యతను గురుదేవుల ప్రధాన శిష్యుడైన *నరేంద్రునికి*(స్వామి వివేకానంద) అప్పగించడమైనది.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

భగవద్గీత అంటే ఏమిటి