శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹 *శ్రీ శారదామాత జీవితచరిత్ర 🌹
3⃣2⃣ *వ రోజు*
*రామ్ లాల్ 'కైంకర్యం' :--*
🌻🌻🌻🌻🌻🌻🌻
మాతృదేవి ఒక సంవత్సరం తర్వాత బృందావనం నుండి 1887 ఆగస్టులో తిరిగి వచ్చారు.
కాశీపూర్ రోజులలో గురుదేవులు ఒక రోజు మాతృదేవిని పిలిచి, 'నా తదనంతరం నువ్వు *కామార్పుకూర్* కు(గురుదేవుల ఊరు) వెళ్లి, అక్కడ నివసించు. ఏమైనా ఆకు కూరలు పండించుకో. వట్టి అన్నమో, ఉడకబెట్టిన ఆకుకూరలో, దొరకింది తింటూ, ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించు. కానీ ఒక విషయం . ఒక చిల్లికాసైనా ఎవరివద్దా చేయిచాచి యాచించవద్దు. చేతులు చాచావంటే నీ తలను కుదువ బెట్టినట్లే. భక్తులెవరైనా ప్రీతితో నిన్ను తమ ఇంట వుండమని ఆహ్వానించవచ్చు. ఆ ఆహ్వానాన్ని కూడా మన్నించకు. అంతకంటే బిచ్చమెత్తి జీవించడం ఉత్తమం. కామార్పుకూర్ లోని నీ సొంత ఇంటిని వదలవద్దు. తిండితిప్పలకు ఎలాంటి లోటు రాదు' అని చెప్పి ఉన్నారు.
ఇక రాబోయే రోజులు దుఃఖమయంగా ఉంటాయని మాతృదేవికి తెలుసు. గురుదేవులు సజీవులై ఉన్నప్పుడే హృదయ్ ఆమెను అవమానపరచడం విదితమే. రామ్ లాల్(గురుదేవుల అన్న కొడుకు) అర్చకుడుగా నియమితుడయ్యాక గురుదేవులను గౌరవించడం మానుకొన్నాడు. ఇలాంటి బంధువులు కామార్పుకూర్ లో మాతృదేవికి ఎలాంటి స్వాగతమిస్తారో ఆమెకు తెలియనిది కాదు. కాశీపూర్ రోజులలో ఒక రోజు గురుదేవులు రామ్ లాల్ తో, "ఇదిగో చూడు! నీ పిన్నమ్మ కామార్పుకూర్‌లో నివసించేలా చూసుకో” అన్నారు. అందుకు రామ్ లాల్, "ఆమె ఎక్కడైనా నివసించనీ” అంటూ పరిహాసపూర్వకంగా బదులు చెప్పాడు. ఆతడి జవాబులోని భావాన్ని గ్రహించిన గురుదేవులు, "ఏం మాట లంటున్నావు? నువ్వు కూడా ఒక మనిషిగా జన్మించావే!" అన్నారు ఆవేదనతో. కామార్పుకూర్ రోజుల గురించి మాతృదేవికి ఏదైనా సందేహం ఉన్నా, అది రామ్ లాల్ సమాధానం విన్న తర్వాత నివృత్తి అయిఉంటుంది. మాతృదేవిపరంగా చూస్తే గురుదేవుల నిర్యాణం కంటే గొప్ప దుఃఖం ఆమే జీవితంలో మరొకటి ఉండదు. అందువల్ల బృందావనంలో అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలను పొందిన మాతృదేవి దుఃఖమయ కాలఘట్టంలో తపోమయ జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యారు.
మాతృదేవి బృందావనం నుండి తిరిగి రావడానికి ముందుగానే రామ్ లాల్ తనకు చేతనయినంత చేసేశాడు. మధుర్ బాబు, రాణీరాస్మణీ చేసిన ఏర్పాటు ప్రకారం గురుదేవులకు నెల జీతంగా *ఏడు రూపాయలు* చెల్లించేవారు. గురుదేవుల నిర్యాణానంతరం ఆ జీతాన్ని మాతృదేవికి ఇస్తూ వచ్చారు. రామ్ లాల్ తో పాటు ఆలయ నిర్వాహకుడయిన దీనానాథ్ కలిసి, గురుదేవుల భక్తులు మాతృదేవిని పోషిస్తున్నారు కాబట్టి వారికి డబ్బు ఆవశ్యకత లేదని చెప్పి ఇచ్చే జీతాన్ని ఆపుచేయించారు. మాతృదేవి ఈ విషయం విన్నప్పుడు కించిత్తు కూడా కలత చెందక, ఆపితే ఆపనీ! ఆయనే వెళ్లిపోయారు డబ్బుతో నేనేం చేసుకుంటాను?” అని మాత్రం అన్నారు.
కానీ ఈ విషయం తెలుసుకున్న నరేంద్రుడు (స్వామి వివేకానంద) ఆలయ నిర్వాహకుల వద్దకు వెళ్లి, ఆ జీతాన్ని మునుపటిలా మాతృదేవికి అందజేయమని పరిపరి విధాల ప్రాధేయ పడ్డాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత గురుదేవుల భక్తులందరూ సమావేశమై ప్రతి నెలా మాతృదేవికి పది రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఏ కారణం వల్లనో ఆ ప్రతిపాదన అమలుకాలేదు.
బృందావనం నుండి కలకత్తాకు వచ్చి ఒక వారం రోజులు బలరాంబోసు ఇంట్లో బసచేసి, మాతృదేవి కామార్పుకూరు బయలుదేరారు. యోగిన్ మా, గోలాప్ మా ఇంకా ఒకరిద్దరు భక్తులు ఆమెతోపాటు వెళ్లారు, బయలుదేరడానికి ముందుగా మాతృదేవి దక్షిణేశ్వరం వెళ్లి కాళీమాతను, ఇతర దేవుళ్లను దర్శించి ఆరాధించారు. గురుదేవులు నివసించిన గది, నహబత్, పంచవటి ఇత్యాది చోట్లనూ చూసివచ్చారు. దుఃఖంతో కలగలసిన ఎన్నెన్ని మథుర స్మృతులు ఆమె హృదయంలో జనించి అణగిపోయివుంటాయో! చెరగని మధుర స్మృతులతో అక్కణ్ణుండి సెలవు పుచ్చుకొన్నారు.
ఆనందమయ కాలఘట్టంలో తమతోపాటు నివసించిన లక్ష్మి (గురుదేవుల అన్న కుమార్తె)ఇప్పుడు తమ్ముళ్లతో దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది. *దుఃఖంతో వెంట వచ్చేది ఆ వ్యక్తి నీడ మాత్రమే* అన్న మాట ముమ్మాటికీ నిజం.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ శారదామాత చరితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment