శారదామాత జీవితచరిత్ర పార్ట్ 12

🌻🌻🌻🌻🌻🌻🌻

🌺శ్రీ మాత్రే నమః🌺

 *🌹_శారదామాత జీవితచరిత్ర_🌹* 

1⃣2⃣ *వ రోజు* 

🌻🌻🌻🌻🌻🌻🌻

సంప్రదాయానుసారం శ్రీ రామకృష్ణ సన్యాసం స్వీకరించారు. ఆయన వివాహితుడని తెలుసుకొన్నప్పుడు ఆయన గురువు *తోతాపురి* ఇలా అన్నారు:

 “ఒక వ్యక్తిలో స్త్రీ పురుష భేదభావం నిలిచివున్నంత దాకా ఆతడి పావనత్వం పరిపూర్ణతను సంతరించుకొనదని పరిగనించం. ఈ దశను అతిక్రమించి సర్వత్రా పరబ్రహ్మస్వరూపుడైన భగవంతుణ్ణి దర్శించే వ్యక్తి మాత్రమే బ్రహ్మజ్ఞాని, బ్రహ్మంలో స్థిరంగా నెలకొన్నవాడని పరిగనించాలి. అటువంటి వ్యక్తికి భార్య ఆటంకం కాదు.” 

ఈ అభిప్రాయాన్ని తమ జీవితంలో ప్రత్యక్షంగా పరీక్షించి చూడగోరారు శ్రీరామకృష్ణులు.

ఒక రోజు రాత్రి శారద, శ్రీరామకృష్ణుల పక్కన మంచం మీద నిద్రిస్తుంది.
అప్పుడు శ్రీరామకృష్ణులు తమ మనసు ఇలా వివేచింపసాగారు:

 "ఓ మనసా' ఇదొక స్త్రీ శరీరం. లోకులు దీన్ని గొప్ప భోగవస్తువుగా ఎంచుతారు. దీన్ని అనుభవించడానికి పడిగాపులు కాస్తారు. కానీ దీనికోసం పోతే దేహ చైతన్య భావనలో కూరుకుపోతారు. దాన్ని అతిక్రమించి సచ్చిదానందఘనుడైన పరమాత్మను అనుభూతి చేసుకోలేరు. 
ఓ మనసా! లోపల ఒక భావనకు ఆశ్రయించి, బయట తద్విరుద్ధ వైఖరి ప్రకటించకు. నిజం చెప్పు. నీకు ఈ శరీరం కావాలా? భగవంతుడు కావాలా? నువ్వు దీనినే కోరే పక్షంలో నీ ముందే ఉంది, అందుకో." ఇలా వివేచిస్తూ శారద దేహాన్ని స్పృశించాలనే భావన మనసులోకి వచ్చి రాక మునుపే ఆయన మనస్సు కుదించుకుపోయి ప్రగాఢ సమాధిలో లీనమైపోయింది. 

ఆ రాత్రి అది మామూలు స్థితికి దిగిరాలేదు. మర్నాడు భగవన్నామాన్ని పదేపదే ఉచ్చరించిన తరువాత ఎంతో ప్రయత్నం మీదట ఆయనకు బాహ్యస్మృతి తెప్పించగలిగారు.

శ్రీరామకృష్ణులు వరుసగా దివ్య స్థితులలో నెలకొని ఉండేవారు. భయాశ్చర్యాలతో శారద శ్రీరామకృష్ణులను చూస్తూ ఉండిపోయేది.

 *మాతృదేవి తన అనుభవాలను ఇలా చెప్పారు:* 

“గురుదేవులు పొందిన దివ్యస్థితులను మాటల్లో వివరించలేను. పారవశ్య స్థితిలో ఒకప్పుడు ఏడ్చేవారు, ఒకప్పుడు నవ్వేవారు, ఒకప్పుడు ప్రగాఢ సమాధి మగ్నులయ్యేవారు. కొన్ని రాత్రుళ్లు పూర్తిగా స్పృహ లేకుండా ఉండేవారు. సంభ్రమాశ్చర్యాలతో  నాశరీరం వణకిపోయేది. పారవశ్యస్థితి అంటే ఏమిటో అప్పటికి నాకింకా తెలియదు. ఎప్పుడు తెల్లవారుతుందోనని ఆందోళనతో నిరీక్షించేదాన్ని. 

ఒకరోజు సమాధిస్థితి చాలాసేపు కొనసాగినప్పుడు, భయపడి హృదయ్ ను రప్పించాను. ఆతడు వచ్చి గురుదేవుల చెవిలో భగవన్నామాన్ని పలుమార్లు ఉచ్చరించారు. ఆ తరువాత కాసేపటికి కొంచెం బాహ్యస్మృతిలోకి రాసాగారు. 

నా పరిస్థితిని అర్థంచేసుకొన్న గురుదేవులు, ఫలానా సమాధి స్థితిలో ఫలానా మంత్రం తమ చెవులలో ఉచ్చరించాలని నాకు నేర్పారు. ఆయన నేర్పినట్లే ఫలానా సమాధి స్థితికి చెందిన మంత్రాలను ఉచ్చరించి ఆయన బాహ్యస్మృతి పొందిన తరువాతే నా భయాందోళనలు తొలగిపోయేవి. కానీ ఆయన ఎప్పుడు సమాధిమగ్నులవుతారో తెలియనందున, కొన్ని సమయాలలో రాత్రంతా మేల్కొని ఉండేదాన్ని. 

నా ఈ అగమ్య గోచర పరిస్థితిని గురుదేవులు క్రమంగా అర్థం చేసుకొన్నారు. నెలలు గడచినప్పటికీ వారి సమాధి స్థితులకు అనుగుణంగా నేను సర్దుకుపోలేకపోతున్నానని గ్రహించి, ఆ తరువాత తమ గదిలో ఉండడానికి నన్ను అనుమతించలేదు; తమ తల్లితోబాటు నహబత్తులోనే ఉండమన్నారు."

🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18

శారదామాత జీవితచరిత్ర🌹 Part 33

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32