శ్రీ శారదామాత జీవితచరిత్ర పార్ట్ 13

🌻🌻🌻🌻🌻🌻🌻

🌺శ్రీ మాత్రే నమః🌺

🌹 *శ్రీ శారదామాత జీవితచరిత్ర🌹* 

    1⃣3⃣ *వ రోజు* 

 *షోదశీ పూజ:-* 

🌻🌻🌻🌻🌻🌻🌻

అది *1873 వ సంవత్సరం* . *మే నెల 26వ* *తేదీ.* *ఫలహారిణీ* *కాళికాదేవి పూజ* నిర్వహింపబడే *అమావాస్య రోజు.* 
నాడు దక్షిణేశ్వర కాళికాలయంలో విశేషపూజలు జరుగుతాయి. గురుదేవులు కూడా కాళీమాతను స్వయంగా పూజించడానికి విశేష ఏర్పాట్లు చేయించారు.

సాయంకాలమయింది.
అమావాస్య కారుచీకట్లు క్రమంగా అంతటా క్రమ్ముకోసాగాయి. ఆలయంలో కాళీమాత పూజ చేయవలసి ఉన్నందున
హృదయ్, గురుదేవుల గదిలో పూజ ఏర్పాట్లన్నీ చేసి, వెళ్లిపోయాడు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిది గంటలయింది.

పూజలో పాల్గొనడానికి శారకు కబురు పంపారు. గురుదేవుల గదికి ఆమె వచ్చింది. ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దిన పీఠాన్ని దేవికి ఆసనంగా పూజారికి కుడివైపు అమర్చారు. గురుదేవులు తమ ఆసనంలో కూర్చున్నారు. పూజ ప్రారంభమైంది.

పూజకు పూజాద్రవ్యాలు శుద్ధి చేయబడ్డాయి. ప్రారంభ విధులు పూర్తికాగానే గురుదేవులు శారదను పీఠం మీద కూర్చోమని సైగ చేశారు. పూజను తదేకంగా తిలకిస్తూన్న శారద అప్పటికే బాహ్య స్మృతిని కోల్పోయి పారవశ్య స్థితిలో ఉంది. తాను ఏం చేస్తున్నదో తెలియక, మంత్రముగ్ధలా మెల్లగా లేచి ఆ పీఠం మీద గురుదేవులకు కుడివైపు ఉత్తరాభిముఖంగా కూర్చుంది. శాస్త్ర విధుల ప్రకారం గురుదేవులు తమ ముందున్న కలశం నుండి పవిత్రీకరింపబడిన జలాన్ని శారదపై చల్లారు. పిదప పఠింపవలసిన మంత్రాలు ఉచ్చరించి ఆవాహన మంత్రాలు ప్రారంభించారు.

“ఓ బాలా! సర్వశక్త్యాధీశ్వరీ, మాతా, త్రిపుర సుందరీ! నాకై సిద్ధి ద్వారాన్ని తెరువు. ఈమె (శారద) మనశ్శరీరాలను పవిత్రీకరించి, ఈమెలో అభివ్యక్తీకరించి సర్వకళ్యాణ సాధనభూతవుకా!"

ఆవాహనం పూర్తిచేశాక శారద శరీరంలో మంత్రపాఠంతో షోడశోపచారాలతో (అంటే పదహారు ఉపచారాలతో నిర్వర్తించే పూజ) యథావిధిగా ఆమెను సాక్షాత్తూ జగజ్జననిగా అర్చించారు.

తదనంతరం నైవేద్యం అర్పించి, దాన్లో ఒకింత తమ చేత్తో ఆమెకు తినిపించారు. ఈలోపు శారద బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయి సమాధిమగ్నురాలైంది. గురుదేవులు కూడా అర్ధబాహ్యస్మృతిలో మంత్రోచ్చారణ చేస్తూ సంపూర్ణ సమాధిలో లీనమైపోయారు. 

చాలాసేపు గడచిపోయింది. రాత్రి రెండవ జాము గడిచి మూడవ జాములో కూడా కొంత గడిచింది.
గురుదేవులలో బాహ్యస్మృతి జాడలు ఒకింత కనిపించసాగాయి. మునుపటి అర్ధబాహ్య స్మృతిని పొంది దేవికి ఆత్మనివేదనం చేయసాగారు. తమతోపాటు తమ జపమాలనూ, సమస్త సాధనాఫలాలను శాశ్వతంగా దేవి పాదపద్మాలకు సమర్పించి, మంత్రాలు ఉచ్చరిస్తూ దేవికి ప్రణమిల్లారు.

 *ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే |* 
 *శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమో స్తుతే ॥* 

షోడశీపూజ పరిసమాప్తమైంది. 
శారద మెల్లగా లేచి మానసికంగా గురుదేవులకు ప్రణమిల్లింది. అర్ధబాహ్య స్థితిలోనే నహబత్తుకు తిరిగివెళ్ళింది.

పూజ సమయంలో శ్రీరామకృష్ణులు సమర్పించిన చీర, గాజులు ఇత్యాదులను ఏం చేయాలో ఆమెకు పాలు బోలేదు. ఈ విషయంగా గురుదేవులను అడిగినప్పుడు ఆయన ఒకింత సేపు అలోచించి, “మీ అమ్మకు ఇవ్వు. కానీ ఆమెను ఒక సామాన్య స్త్రీగా కాకుండా, *ఆదిపరాశక్తిగా* భావించి సమర్పించు” అన్నారు.

పూజ స్వల్పమైనదే. కానీ అది శారదా శ్రీరామకృష్ణుల జీవితంలోనూ, వారి
అవతారకార్యంలోనూ వహించిన స్థానం అత్యంత ప్రధానమైనది.

షోడశీ పూజ ద్వారా సాటిలేని గురుదేవుల సాధనల ఫలాన్ని ఆమె తన సొంతం చేసుకుంది. ఈ పూజ శ్రీరామకృష్ణుల అవతార కార్యంలో ఆమెను వారసురాలిగా చేసింది.

అవతార పురుషులైన శ్రీరామకృష్ణులు చేసిన పూజను స్వీకరింపగలిగే శక్తి ఒక మామూలు స్త్రీకి ఉంటుందా? 

 *ఉండదు కదా! కాబట్టే* 

 *ఈ పూజ ద్వారా శారద ఒక మామూలు వ్యక్తి కాదని లోకానికి చాటిచెప్పారు శ్రీరామకృష్ణులు.*

🌻🌻🌻🌻🌻🌻🌻

🌹శ్రీ శారదామాత చరితామృతం🌹

🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18

శారదామాత జీవితచరిత్ర🌹 Part 33

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32