శారదామాత జీవితచరిత్ర పార్ట్ 20
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ మాత్రే నమః🌺
2⃣0⃣ *వ రోజు*
🌻🌻🌻🌻🌻🌻🌻
భర్త చేసే చిన్న చిన్న ప్రశంసలు భార్యకు ఎంతో ఉత్సాహభరితం గాను, ఆనందదాయకంగాను ఉంటాయి.
మాతృదేవి మధురంగా పాడతారని మనం విన్నాం. ఒక రాత్రి మాతృదేవి, లక్ష్మి ఇద్దరూ పాడుతున్నారు. గురుదేవులు ఆ పాటను పూర్తిగా విన్నారు. మర్నాడు మాతృదేవితో, "నిన్నటి రాత్రి ఆ పాటను తన్మయంతో పాడవు. వినడానికి ఎంతో బాగుంది" అన్నారు.
కొన్ని సమయాల్లో మాతృదేవి కాళీమాతకు పూలహారం తయారుచేసి ఇచ్చేవారు. ఒక రోజు మల్లెమొగ్గలను, ఎర్ర గన్నేరు మొగ్గలను దట్టంగా కట్టి పూలహారం
తయారుచేశారు. మొగ్గలు వికసింపనారంభించినప్పుడు ఆలయానికి పంపించారు. పూజారి ఆ పూలహారాన్ని కాళీమాతకు అలంకరించడమూ, గురుదేవులు అక్కడికి రావడమూ
ఒక్కసారి జరిగాయి. నలుపు చలవరాతి విగ్రహంపై తెలుపు, ఎరుపుతో ఆ పూలహారం ఎంతో అందంగా కనిపించింది. 'ఆహా! ఏం అద్భుతం! ఎంత ఆకర్షణీయంగా ఉంది!' అంటూ ప్రశంసించారు గురుదేవులు. ఈ పుష్పమాలను తయారుచేసింది మాతృదేవే అని తెలుసుకున్నప్పుడు, "ఆహా! ఎవరైనా వెళ్లి ఆమెను తీసుకురండి. ఆమె కూడా ఈ అందాన్ని చూడాలి!"అన్నారు. పనిమనిషి బృందతో మాతృదేవి అక్కడికి వచ్చారు. మాతృదేవి వస్తున్నారని తెలుసుకుని భక్తులు ఒదిగి నిలబడ్డారు. కాళీమాత కంఠంలో తాము కట్టిన పూలమాల శోభిస్తూ ఉండడం చూసి ఉప్పొంగిపోయారు.
"నన్ను 'తుయీ' అంటూ పిలవని ఒకరిని వివాహం చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఒక పువ్వును నా మీదికి విసిరి కూడా నన్ను నొప్పించాలని తలంచని ఉత్తములు ఆయన" అంటూ మాతృదేవి ప్రశంశించేటంతగా గురుదేవులు, మాతృదేవిపట్ల వ్యవహరించారు.
【వంగ భాషలో భార్య, విద్యార్థి, వయస్సులో చిన్నవారిని, పనిమనుషులను *'తుయీ'* అని; మిత్రులను, సమానులైన వారిని *'తుమీ'* (you); గురుదేవులు మాతృదేవిని *'తుమీ'* అని పిలిచేవారు.】
ఒకసారి మాతృదేవి గురుదేవులకు ఆహారం తీసుకువచ్చి ఉంచి వెళ్లిపోయారు. వచ్చిన వ్యక్తి లక్ష్మి అనుకుని గురుదేవులు *'తుయీ'* అనే పదాన్ని వాడి, "తలుపు మూసి వెళ్ళు" అన్నారు. మాతృదేవి 'సరి' అని చెప్పినప్పుడే, వచ్చింది
లక్ష్మి కాదని ఆయనకు తెలిసింది. అంతే, తామేదో అమర్యాద చేసినట్లు, "ఆహా! నువ్వా! లక్ష్మి అని అనుకున్నాను. అన్యథా భావించవద్దు". అంటూ పదేపదే కలతపడుతూ మాతృదేవితో అన్నారు. దాంతో ఆగారా?
మర్నాడు తెల్లవారగానే నహబత్ తలుపు వద్ద నిలబడి, “ఇదిగో చూడు! నేను అలా అనడం తలచుకొని రాత్రంతా నిద్రపోలేకపోయాను" అని అన్నారట. అంత మాత్రమే కాదు, మాతృదేవి ఆయన తైలమర్ధనం చేసిన తరువాత, కాళ్లు ఒత్తుతూ పరిచర్యలు చేశాక, *చేతులు జోడించి ఆమెకు నమస్కరించేవారట* !
మాతృదేవి మాటలపై ఎంతో విశ్వాసం ఉండేది గురుదేవులకు. అనేక విషయాలలో మాతృదేవిని సంప్రతించేవారు.
మాతృదేవి ఆధ్యాత్మిక ఉన్నతిని గ్రహించిన గురుదేవులు తాము వారికి 'మర్యాద చూపడమే కాకుండా, ఇతరులు కూడా అలాగే చెయ్యాలనే విషయంలో జాగ్రత్త వహించారు. మాతృదేవిని అగౌరవపరిచేవారు, ఎలాంటి ఘోర పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుందో ఆయనకు స్పష్టంగా తెలుసు.
ఒకసారి గురుదేవుల సమక్షంలోనే హృదయ్ మాతృదేవితో అమర్యాదగా మాట్లాడాడు. మాతృదేవి దాన్ని సహించారు. కానీ హృదయ్ చర్యవలన కలిగే పర్యవసానాన్ని ఎరిగిన వారు కాబట్టి గురుదేవులు, "ఇదిగో చూడు! నువ్వు నన్ను ఎంతగానో నిందించావు. కానీ ఆమెతో మాత్రం ఆట్లాడకు! నాలోని శక్తి కోపగించుకున్నా, బహుశా నువ్వు బతికి బయటపడవచ్చు. కానీ ఆమెలోని శక్తి బుసకొడితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దిగి వచ్చినా నిన్ను కాపాడలేరు” అంటూ ఆతనిని హెచ్చరించారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ శారదామాత చరితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment