శారదామాత జీవితచరిత్ర పార్ట్ 23

🌻🌻🌻🌻🌻🌻🌻

🌸శ్రీ మాత్రే నమః🌸

🌺 *శారదామాత జీవితచరిత్ర* 🌺

   2⃣3⃣ *వ రోజు* 
 
*కడుపు నొప్పి-దేవి చికిత్స :-* 

🌻🌻🌻🌻🌻🌻🌻

తమ తండ్రి పరమపదించిన తర్వాత 1874 ఏప్రిల్ లో మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చారు. ఈ సమయంలో కడుపునొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. శంభుమల్లిక్  ఆమెకు చక్కని చికిత్స ఏర్పాట్లు చేయడం వల్ల ఆమె కోలుకొన్నారు. బాగా కోలుకున్న తర్వాత 1875 సెప్టెంబర్లో జయరాంబాటికి వచ్చారు.

గ్రామానికి వెళ్లిన వెంటనే దురదృష్టవశాత్తూ ఆ కడుపు నొప్పి తిరగబెట్టి మాతృదేవిని వేధించసాగింది. మాతృదేవి తల్లి, సోదరులు తమకు చేతనయినంత వరకు చికిత్సలు చేయించారు. అయిన బాధ
ఉపశమించలేదు. ఆమె బ్రతికి బట్టకడతారా అనిపించింది.ఈ విషయం తెలుసుకున్న గురుదేవులు ఎంతో ఆవేదనపడ్డారు. *"మానవ జన్మ పరమావధిని సాధించకుండానే ఆమె చనిపోతుందా? ఇలా అకాల మరణానికా ఆమె జన్మించింది!"* అంటూ హృదయ్ తో పదే పదే చెబుతూ దుఃఖపడసాగారు.

మాతృదేవి ఆరోగ్యం మరీ దిగజారింది. శరీరమంతా వాచిపోయింది. కళ్ళ నుండి ఎడతెగక స్రవించే నీళ్ల వలన చూపు మందగించింది. పున్నమి చంద్రుని వెలుతురు కూడా అప్పుడు తమకు కారుచీకటిగా కనిపించినట్లు కాలాంతరంలో మాతృదేవి తెలిపారు. నిరంతర విరేచనాల వల్ల ఆమె సదా కొలను దరిదాపుల్లోనే ఉండవలసి వచ్చింది. కృశించిపోయి చర్మం ఎముకలతో మాత్రమే ఉన్న తమ శరీర ప్రతిబింబాన్ని కొలను నీళ్లలో చూసిన మాతృదేవి, ఛీ! సిగ్గుచేటు! *శరీరమనేది ఇదే! దీనిని ఇంత గొప్ప చేయడమెందుకు?* దీనిని వదిలేసుకుందాం' అని అనుకున్నారు. 

అప్పుడు ఆమె తమ్ముడయిన ఉమేష్, *సింహవాహిని* ఆలయానికి వెళ్లి *ప్రాయోపవేశ వ్రతం* చేపట్టమని ప్రాధేయపడ్డాడు. తమ్ముడు చెప్పినట్లు ఇక భగవంతుని కృపాకటాక్షం మాత్రమే తమను కాపాడగలుగుతుందనే దృఢనిశ్చయానికి వచ్చిందామె. సింహవాహిని ఆలయానికి వెళ్లి, మరణమే సంభవించినా కూడా, దేవి కృపాకటాక్షం కలిగేదాకా ఆహారమో, జలమో సేవించకుండా ప్రాయోపవేశమనే కఠోరమైన వ్రతాన్ని ఆచరించాలని తీర్మానించారు.

తల్లి, సోదరులకు తెలియకుండా ఒకస్నేహితురాలి సహాయంతో సింహవాహిని సన్నిధికి వెళ్లారు. ప్రాయోపవేశమనే వ్రతాన్ని ఆచరించి సింహవాహిని సన్నిధిలో పడిపోయారు. విరేచనాల కారణంగా శరీరం శక్తిని కోల్పోయి, కొలను దగ్గరికి వెళ్లడానికి ప్రాక్కుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఇంత జరిగాక సింహవాహిని ఇక ఆలస్యం చేయలేదు. కంటి చూపు ఆ రోజే మెరుగుపడసాగింది, ఇతర జబ్బులు కూడా త్వరలోనే సమసిపోయాయి. "

మరుసటి సంవత్సరం మాతృదేవి *మలేరియా జ్వరంతో బాధపడ్డారు.* ఆ కారణంగా పేగులు ఉబ్బి ఎంతో కష్టపడసాగారు. చికిత్స కోసం పక్క గ్రామమైన కోమోపట్-ఎదన్ గంజ్ కి ఆమెను తీసుకువెళ్లారు. అక్కడి చికిత్స వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. కానీ చికిత్సా విధానం కఠోరమైనది. శరీరంలో వాపు ఉన్నచోట ఒక అరటి ఆకును ఉంచి,
దానిమీద బాగా మండుతున్న ఒక రకమైన కర్రతో వాత పెడతాడు వైద్యుడు. ఆ చోట చర్మం వేడివల్ల సంకోచిస్తుందట. అక్కడి శివాలయంలో ఈ చికిత్స జరుగుతుంది. వాత పెట్టేటప్పుడు వ్యాధి గ్రస్థులు ఆ బాధను ఓర్చుకోలేక లేచి పరుగులు తీస్తారు కాబట్టి వారి కాళ్లు చేతులను కొందరు గట్టిగా అదిమి పట్టుకుంటారు. ఆ తర్వాతే చికిత్స మొదలవుతుంది. కానీ పువ్వు కన్నా మృదులమైన మాతృదేవి అవసరమయితే వజ్రం కంటే కఠినంగా ఉండగలరని నిరూపించింది ఈ చికిత్స. తమను ఎవరూ పట్టుకోనక్కర లేదని చెప్పి, క్రూరమైన ఆ చికిత్స కల్పించే బాధను ప్రశాంతంగా ఓర్చుకున్నారు. కొన్ని రోజులకు ఆమె వ్యాధి నయమయింది.

🌻🌻🌻🌻🌻🌻🌻

🌹శ్రీ శారదామాత చరితామృతం🌹

🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

భగవద్గీత అంటే ఏమిటి