శారదామాత జీవితచరిత్ర పార్ట్ 25

🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ మాత్రే నమః🌺

 🌸 *_శారదామాత జీవితచరిత్ర_* 🌸

2⃣5⃣ *వ రోజు* 

 *ప్రేమకున్న శక్తి :-* 
🌻🌻🌻🌻🌻🌻🌻
ఒకసారి జయరాంబాటి నుండి దక్షిణేశ్వరానికి వెళ్లే దారిలో జరిగిన సంఘటన మాతృదేవి ప్రేమకున్న అపార శక్తిని సూచిస్తుంది. 

పొదుపుగా ఖర్చు పెట్టే స్వభావం కారణంగానో, డబ్బు కొరత కారణంగానో, మరే ఇతర కారణాల వల్లనో మాతృదేవి పలుసార్లు జయరాంబాటి, కామార్పుకూర్ల నుండి దక్షిణేశ్వరానికి కాలినడకనే వెళ్లాల్సివచ్చింది. ఇలా నడచి వెళ్లినప్పుడు ముందుగా ఆరాంబాగ్ ను చేరుకోవాలి. తర్వాత ఎనిమిది, పది మైళ్ళ విస్తీర్ణం గల తేలో, భేలో పచ్చిక మైదానాన్ని దాటి 
తారకేశ్వరం చేరాలి. ఆ తర్వాత కైకలాల్
మైదానం దాటి వైద్యవాడి చేరుకుని, గంగానది దాటాలి. ఆ రెండు మైదానాలు బందిపోటు దొంగలకు ఆలవాలం.

ఉదయం, పగలు, మధ్యాహ్నం, సాయంత్రం అంటూ వేళాపాళా లేకుండా బాటసారులు వీరి చేతుల్లో చిక్కి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రజలు నేటికీ చెప్పుకొంటారు. తేలో, భేలో అనే రెండు సమీప గ్రామాలకు సుమారు రెండు మైళ్ల
దూరంలో తన కోరలను బయటికి చాచి ఒక భయంకరమైన కాళికాదేవి విగ్రహం
వెలసివుండడం నేటికీ చూడవచ్చు. ఈ 
కాళికను తేలో, భేలో వాసులు, *"బందిపోట్ల కాళీ"* అని పేర్కొంటారు. బందిపోట్లు ఈ కాళికను పూజించిన తర్వాతే దోపిడీలు హత్యలు ఇత్యాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వారి బారి నుండి తప్పించుకోవడానికి ఆ రెండు ప్రాంతాలలోని ప్రజలు గుంపులు గుంపులుగానే వెళతారు.

ఒకసారి లక్ష్మి, శివరాం మరికొందరితో మాతృదేవి కామార్పుకూర్ నుండి దక్షిణేశ్వరానికి బయలుదేరారు. అందరూ ఆరాంబాగ్ చేరుకున్నారు. ఇంకా రాత్రి కాలేదు. అంతలోపునే తేలో, భేలో మైదానాన్ని దాటి వెళ్లిపోవచ్చునని వారు రాత్రికి అక్కడ బసచేయకుండా ముందుకు సాగారు. నడచి నడచి మాతృదేవి బాగా అలసిపోయారు. అయినా ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. నాలుగు మైళ్లు నడిచిన తర్వాత, ఇక నడవలేక వెనుకబడిపోయారు. ఆమె వెంట వచ్చినవారు కాసేపు వేచివుండి మాతృదేవి తమను చేరుకోగానే త్వరగా నడువమని చెప్పి ముందుకు వెళ్లిపోయారు. ఆ మైదానం మధ్యకు చేరుకునేసరికి మాతృదేవి బాగా వెనుకబడిపోయారు. దాంతో వారందరూ మళ్లీ మాతృదేవికోసం వేచివుండి ఆమె వచ్చిన వెంటనే, "ఇంత నిదానంగా నడిస్తే ఎలా! చీకటి పడక ముందే ఈ మైదానాన్ని దాటలేం. అందరూ బందిపోట్ల వాతబడవలసిందే" అన్నారు. వారిలో అసందిగ్ధత భయమూ కలగడానికి తాము కాణమయ్యామని గ్రహించిన మాతృదేవి వారితో తమకోసం వేచివుండవద్దని చెప్పి “మీరందరూ తిన్నగా తారకేశ్వరం వెళ్లి విశ్రాంతి తీసుకోండి. వీలయినంత త్వరలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను" అని అన్నారు. సమయం గడచిపోతూవుండడంతో వారంతా మాతృదేవి సలహా మేరకు వేగంగా ముందు నడవసాగారు. కాసేపటికల్లా వారు మాతృదేవికి కనుమరుగైపోయారు.

మైదానం మధ్య భాగం చేరుకున్న కాసేపట్లోనే చీకటి పడసాగింది. ఏం చేయాలో పాలుబోక మథనపడుతున్నప్పుడు నల్లటి ఆకృతిలో ఒక దృఢకాయుడు భుజంపై ఒక దుడ్డుకర్ర పెట్టుకుని వేగంగా తమవైపు రావడం చూశారు. అతనికి వెనుక కాస్త దూరంలో మరొక వ్యక్తి కూడా రావడం కంటబడింది. తటపటాయిస్తూ అక్కడే నిలబడిపోయారు. కొంత సేపటికి ఆ వ్యక్తి మాతృదేవిని సమీపించి, "ఏయ్! ఎవరది? ఈ సమయంలో ఇక్కడ ఎందుకు నిలబడివున్నావు?" అంటూ గర్దించాడు. మాతృదేవి అతణ్ణి ఆశ్రయించి, ఆతణ్ణి తన తండ్రిగా భావించి, “నాన్నా! నాతోపాటు వచ్చిన వారంతా ముందుకు వెళ్లిపోయారు. నేను దారి కూడా తప్పిపోయానేమో అనిపిస్తున్నది. నన్ను వారి దగ్గరికి చేరుస్తారు కదా! మీ అల్లుడు దక్షిణేశ్వరంలో రాణి రాస్మణి ఆలయంలో ఉంటున్నారు. నేను ఆయన వద్దకే వెళుతున్నాను. నన్ను అక్కడికి తీసుకెళితే ఆయన ఎంతో సంతోషిస్తారు” అని అన్నారు. 

ఇలా మాట్లాడుతున్నప్పుడే వెనుక వస్తున్న వ్యక్తి  ఆ దృఢకాయుని భార్య అని మాతృదేవి గ్రహించారు. ఆ స్త్రీని చూడగానే మాతృదేవి మరింత ధైర్యం పుంజుకొని ఆమె చేతులు పట్టుకుని, "అమ్మా! నేను నీ కుమార్తె శారదను! నాతోపాటు వచ్చిన వారందరూ ముందుగా
వెళ్లిపోవడంతో ప్రమాదంలో చిక్కుకొన్నాను.అదృష్టవశాత్తు నువ్వు, నాన్నా కనిపించారు. లేకపోతే ఏం చేసేదాన్నో నాకే తెలియదు" అని అన్నారు.

మాతృదేవి సరళత, నిస్సంకోచ వైఖరి, విశ్వాసం, తియ్యని మాట ఆ బందిపోటు దంపతులను అమితంగా ఆకట్టుకున్నాయి. వారు మాతృదేవిని తమ సొంత కుమార్తె గా భావించి ఊరడించారు. మాతృదేవి అలసిపోయి ఉండడం గమనించి, తేలో భేలో గ్రామంలోని ఒక చిన్న దుకాణానికి తీసుకెళ్లి, రాత్రి అక్కడ బస చేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఆ బందిపోటు బొరుగులు కొనితెచ్చి తినడానికి ఇచ్చాడు. ఇలా తల్లితండ్రులలా ప్రేమతో లాలించి, మాతృదేవిని నిద్ర పుచ్చి, ఆ దంపతులిద్దరూ కాపలాకాస్తూ కూర్చున్నారు. ' తెల్లవారగానే వారు మాతృదేవిని లేపి సూర్యోదయానికి ముందుగా తారకేశ్వరం చేరుకున్నారు. ఆ స్త్రీ తన భర్తతో, “నా కుమార్తె నిన్నరాత్రి ఏమీ తినలేదు. నువ్వు తారకేశ్వర స్వామిని దర్శించి, వచ్చేటప్పుడు చేపలు, కూరగాయలు తీసుకురా! ఈ రోజు ఆమెకు సుష్టుగా తినిపించాలి" అని చెప్పింది. ఆ బందిపోటు దొంగ వెళ్లిన కాసేపటికే, మాతృదేవితో వచ్చిన వారందరూ ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. అప్పుడు మాతృదేవి వారి కందరికీ పరిచయం చేస్తూ, "వీరు మాత్రం నాకు నిన్న రాత్రి ఆశ్రయం ఇవ్వకపోతే నా గతి ఏమయివుండేదో తెలియదు” అన్నారు. మాతృదేవి ఆ దంపతులకు తమ కృతజ్ఞతలను చెప్పుకుంటూ సెలవు ఇప్పించమని అర్థించారు.  అవకాశం చూసుకొని దక్షిణేశ్వరానికి తప్పకుండా రావలసిందిగా వారిని బ్రతిమిలాడారు. అందుకు సమ్మతించిన తర్వాతే, ఎంతో కష్టం మీద ఆమె బయలుదేరారు. వారు కూడా మాతోపాటు చాలా దూరం దాకా వచ్చారు. ఆ స్త్రీ దారి ప్రక్కనున్న చేలలో పచ్చి సెనగలు కోసి నా కొంకుకు ముడికట్టి ఏడుస్తూ 'శారదా! నా తల్లీ! రాత్రి బొరుగులు తినేటప్పుడు వీటిని కూడా తిను' అని చెప్పింది. ఇచ్చిన మాటను ఆ దంపతులు నిలబెట్టుకున్నారు. 

మాతృదేవిని చూడడానికి పలుమార్లు తీపి పదార్థాలతో దక్షిణేశ్వరానికి వచ్చారు. అన్ని వివరాలు తెలుసుకొని గురుదేవులు కూడా వారు వచ్చినప్పుడు ఆప్యాయంగా వారిని ఆహ్వానించి, ఉపచర్యలు చేసి ఒక అల్లునిలా ప్రవర్తించారు. వారు ప్రస్తుతం సామాన్యులుగా, మంచి వారుగానూ మారి జీవనం సాగిస్తున్నారు. ప్రేమ స్వరూపిణి అయిన మాతృదేవి సాన్నిధ్యంలో బందిపోట్లు తమ క్రూరత్వాన్నీ కోల్పోయి సంస్కారవంతులయ్యారు.

కాలాంతరంలో ఒకసారి ఎవరో ఈ సంఘటనను గూర్చి అడిగినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: 

దాన్ని గురించి నేను ఏమీ చెప్పదలచుకోలేదు. అప్పుడు నాతోపాటు లక్ష్మీ, శివరాం తదితరులు ఉన్నారు. ఈ సంఘటన గురించి చెబితే వారు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయిన విషయం కూడా చెప్పాల్సివస్తుంది. అప్పుడు వారి మనస్సు ఎంత ఆవేదన చెందుతుంది. ఎంతయినా వారు కూడా నా బిడ్డలే కదా! వారిని కించపరచడం న్యాయమా? అందువల్లనే ఈ సంఘటనను గురించి చెప్పడంలేదు. *ఇతరుల మనస్సులను బాధపెట్టకూడదనే విషయంలో మాతృదేవి శ్రద్ధ తీసుకోవడం ఎంత ఆదర్శప్రాయం కదా!* 

 *ప్రేమకు ఉన్న శక్తి అటువంటిది.ప్రేమ పూరితమైన వ్యక్తి సమక్షంలో వైవిధ్య భావాలు తొలగిపోతాయి.* 
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

భగవద్గీత అంటే ఏమిటి