శారదామాత జీవితచరిత్ర పార్టీ 27

🌻🌻🌻🌻🌻🌻🌻
🌸శ్రీ మాత్రే నమః🌸

🌺 * శారదామాత జీవితచరిత్ర 🌺

2⃣7⃣ *వ రోజు* 

 *కాశీపూర్ లో గురుదేవులు:-* 
🌻🌻🌻🌻🌻🌻🌻
గురుదేవులు *శ్యాంపుకూర్* కు వచ్చి మూడు నెలలయింది. వైద్యుల చికిత్స, మాతృదేవి పరిచర్యలూ, శిష్యుల సేవలతో కూడా వ్యాధి తగ్గుముఖం పట్టక రోజు రోజుకు తీవ్రమవసాగింది. కాశీపూర్ లో ఇచ్చిన ఔషధాలు ఇప్పుడు నిష్ప్రయోజన మయినాయి. కలకత్తా కలుషిత వాతావరణం కారణంగానే వ్యాధి
తీవ్రరూపం దాలుస్తుందని తీర్మానించిన
వైద్యులు, నగర పొలిమేరలలో చక్కని గాలివీచే స్థలానికి ఆయనను తీసుకెళ్లడం మంచిదని సలహా ఇచ్చారు. అందుకే తగిన ఇంటి కోసం వెదకిన భక్తులు *కాశీపూర్* అనేచోట ఒక ఉద్యాన గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. 

1885 డిసెంబర్ 11వ తేది ఆ ఇంటికి గురుదేవులను తరలించి తీసుకెళ్లారు. కాశీపూర్ ఉద్యానగృహం విశాలంగా ఉంది, జన సంచారం లేని చోట ఉంది. ఎటువైపు చూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు విరబూసిన
చెట్లు, పసిడి పచ్చని ఆరుబయలు. నాలుగు నెలలు కలకత్తాలో గడిపిన గురుదేవులకు ఈ చోటు చాలా అందంగా కనబడింది. ఉద్యానవనం లోపల ప్రవేశించి, అక్కడ వీచే గాలి పీల్చగానే ఆయన ఉప్పొంగిపోయి, చుట్టూరా చూస్తూ ఆనందంతో లోపలికి వెళ్లారు. తర్వాత మేడమీద తమకు కేటాయించిన గదికి దక్షిణంగా ఉన్న డాబా మీదకు వెళ్లి నిలబడి తోట అందాన్ని కాసేపు చూసి ఆనందించారు. 

శ్యాంపుకూర్ ఇంట్లో బందీగా ఉన్నట్లు ఇక్కడ లేదు. ఇక్కడ మరింత చక్కగా సేవలు చేయవచ్చని మాతృదేవి కూడా సంతోషించారు. భక్తులు గురుదేవుల ప్రత్యేక చికిత్సకు కావలసిన వసతులన్నింటిని ఏర్పాటు చేశారు. 
 *విఖ్యాత వైద్యుడయిన, మహేంద్రలాల్ సర్కార్* గురుదేవులకు చికిత్స చేయసాగాడు. యువ శిష్యులు గురుదేవులతోపాటు ఉంటూ ఆయనకు సేవలు చేస్తూ వేచివుండసాగారు.

మాతృదేవి వంట మాత్రమే కాకుండా ప్రతిరోజూ మధ్యాహ్నానికి మునుపు, సాయంత్రమయిన కాసేపటికి, గురుదేవులకు తామే ఆహారం వడ్డించి, ఆయన ఆహారం పుచ్చుకొనే దాకా అక్కడే ఉండేవారు. దక్షిణేశ్వరానికి వచ్చే కొందరు భక్తురాండ్రు కూడా అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి కొన్ని గంటలసేపు, వీలునుబట్టి ఒకటి రెండు రోజులు అక్కడే బసచేసేవారు.

రామకృష్ణ సంఘ చరిత్రలో కాశీపూర్ శాశ్వత స్థానం వహించింది. గురుదేవుల జీవితంలోని అత్యంత మహత్తర సంఘటనలు ఇక్కడే జరిగాయి. ఇక్కడే ఆయన నరేంద్రుని జీవితాన్ని తీర్చిదిద్ది, యువకులను ఆతడికి అప్పగించి సంఘానికి పునాదులు వేశారు.కాశీపూర్ ఉద్యాన గృహంలో 1886 ఆగష్టు 15 వరకు నివసించారు. ఈ ఎనిమిది నెలలలో ఆయనను పీడిస్తున్న వ్యాధి క్రమేణా తీవ్రమవుతూ ఆయన శరీరాన్ని అస్థిపంజరంగా మార్చేసింది. అయినా సుస్థిరమయిన ఆయన మనసు వ్యాధినీ, దాని కారణంగా కలిగిన బాధను త్రోసిపుచ్చింది. తాము అప్పటికే ప్రారంభించిన కార్యాన్ని ఎలాగైనా పూర్తిచేయాలని ఆయన కంకణం కట్టుకొన్నట్లు కనిపించారు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా శిష్యులకూ, భక్తులకూ ఆవశ్యకమయిన తర్పీదు, ప్రత్యేకించి ఒక్కొక్కరికి, కొన్ని సమయాల్లో అందరినీ కలిపి ఇవ్వసాగారు. ఒక రోజు నరేంద్రుణ్ణి పిలిచి తక్కిన శిష్యులను చూపిస్తూ, *“వీరందరి బాధ్యత నీకే వదలిపోతున్నాను, వీరందరూ సాధన అనుష్ఠించేటట్లు, ఇంటికి తిరిగి పోకుండా చూసుకో!"* అంటూ యువకుల బాధ్యతను అతడికి అప్పగించారు.

ఎంతో ప్రశాంతంగా యువకులందరికీ సన్యాస ఆదర్శంలో తర్ఫీదునిచ్చారు గురుదేవులు. ఒక రోజు వారందరినీ బయటికి వెళ్లి భిక్షాటన చేసిరమ్మన్నారు. వారిలో పలువురు ధనవంతుల పిల్లలు; పుష్కలంగా ధనంతో పోషించబడినవారు. అయినా గురుదేవుల ఆజ్ఞను శిరసావహించి ఎంతో సంతోషంగా బయలుదేరారు. వారు *మొట్టమొదట భిక్ష యాచించింది మాతృదేవి వద్దనే.* వారు వెళ్లి యాచించగానే *మాతృదేవి ఒక్క రూపాయి వారి భిక్షాపాత్రలో వేశారు.* ఇలా రామకృష్ణ సంఘానికి ప్రప్రథమ కృపాశక్తిని ప్రసాదించారు మాతృదేవి. 

ఆ తర్వాత వారు భిక్షకై బయటికి వెళ్లారు. లభించిన బియ్యం, కూరగాయలను వండి గురుదేవుల వద్దకు తీసుకువచ్చారు. అందులో కాస్త నోట్లో వేసుకుంటూ గురుదేవులు, *"మంచి పని చేశారు. ఈ ఆహారం పరమ పవిత్రమైనది"* అన్నారు. ఆ మాటలతో వారి ఆనందం అవధులు దాటింది. ఇలా *రామకృష్ణ సన్న్యాస సంఘానికి ఆయన శ్రీకారం చుట్టారు.* 
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

భగవద్గీత అంటే ఏమిటి