శారదామాత జీవిత చరిత్ర part 9

🌻🌻🌻🌻🌻🌻🌻

శ్రీ మాత్రే నమః🌸
 
*🌹శారదామాత జీవిత* 🌹
పార్ట్ 9
🌻🌻🌻🌻🌻🌻🌻

మొదటిసారి కలుసుకున్నప్పుడు ఇంత ఆప్యాయత చూపి అభిమానించిన ఆయన నన్ను ఎన్నటికీ మరవలేదు. తగిన సమయం వచ్చినప్పుడు నన్ను ఆయన వద్దకు
రప్పించుకుంటారు” అంటూ శారద తనను తాను సమాధానపరచుకొనేది. ఇలా రోజులు గడవ సాగాయి. ఆమె కూడా విశ్వాసాన్ని సడలించక గురుదేవులు తనను రప్పించుకొనే ఆ శుభదినం కోసం ఆతురతతో ఎదురు చూడసాగింది.

ఇలా ఒకటి ,రెండు రోజులు కాదు. *నాలుగు సుదీర్ఘ సంవత్సరాలు* దొర్లిపోయాయి. శారద ఇప్పుడు *పద్దెనిమిదేళ్ల యువతి.* పిలుపుకోసం ఎదురుచూస్తున్న తరుణంలో 'శ్రీరామకృష్ణులకు *పిచ్చిపట్టింది* ' అనే పిడుగు లాంటి వదంతి వ్యాపించింది. కుప్పకూలిపోయింది శారద! తనను తాను సంబాళించుకొనే లోపుగానే ఈ విషయం గ్రామమంతా ప్రాకిపోయింది. *'అదిగో పిచ్చివాడి భార్య'* అంటూ ఎగతాళిచేశారుకొందరు. 'అయ్యో! నీకా ఇలాంటి పరిస్థితి' అంటూ సంతాపం నటిస్తూ కొందరు
అనందించారు. మొత్తానికి శారద తన ముఖం భయట
చూపించలేకపోయింది. రోజంతా ఇంట్లోనే గడపసాగింది. 

ఆమె సాంత్వన కోసం వెళ్లే చోటు భాను అత్త ఇల్లు మాత్రమే. మండుటెండలో
చల్లని నీడలా శారదకు లభించింది *వృద్ధురాలైన భాను అత్త* . గ్రామస్థుల అవహేళనతో విసిగిపోయే శారదకు,ఆమె తల్లి శ్యామసుందరికి ధైర్యం చెప్పేది. 

"ఇదిగో చూడండి. మీ అమ్మాయి సామాన్యురాలు కాదు. మీ అల్లుడు కూడా అంతే! వాళ్లిద్దరూ పార్వతి పరమేశ్వరులు. ఇలా శ్యామసుందరితో మాత్రమే కాకుండా గ్రామస్థులతో కూడా చెప్పేది భాను అత్త. కానీ పట్టించుకునే నాథుడెవడు?

కానీ శారద? ఆమె ఇవన్నీ వినే స్థితిలో లేదు. ఈ వార్త నిజమై ఉంటుందా? అనే ప్రశ్న ఆమెనువేధించేది.  ఎలాగయిన తన భర్త దగ్గరకు వెళ్లాలనుకుంది.కానీ లజ్ఞాస్వరూపిణి యైన శారద తన భర్త వద్దకు వెళ్ళాలనే కోరికను ఎలా వ్యక్తపరచగలదు? ఎవరితో చెప్పగలదు? అందువల్ల తగిన తరుణం కోసం నిరీక్షించసాగింది.

1872 మార్చి. *డోల్ పూర్ణిమ* పండుగ దగ్గర పడుతోంది. ఆ రోజు *గంగా* *స్నానం* చేయడం విశేషం. జయరాంబాటి నుండి పలువురు స్త్రీలు కలకత్తాకు వెళ్లనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దక్షిణేశ్వర్ వెళ్లాలని తీర్మానించింది శారద. ఈ విషయం ఒక స్త్రీ ద్వారా తండ్రికి తెలియజేసింది. కుమార్తె
మనస్సును అర్థం చేసుకున్న రామచంద్రుడు, “ఎందుకు? నేను వెళ్లి వదిలిపెట్టివస్తాను" అంటూ తాను
బయలుదేరాడు. 
పల్లకి ఏర్పాటుకు స్తోమత లేనందువల్ల కాలినడకనే వెళ్ళవలసివచ్చింది.

దక్షిణేశ్వర్ చేరుకోవడానికి ఇంకా *అరవై మైళ్లు* ప్రయాణం చేయాలి. ప్రారంభంలో ప్రయాణం ఆనందదాయకంగానే సాగింది. ఒకటి రెండు రోజులు గడిచాయి. ఇలా ఇంత సుదూర నడక శారదకు అలవాటు లేనందువలన ఆమె ఎంతో
అలసిపోయింది.ఆమెకు మలేరియా జ్వరం వచ్చింది. ఒక్క అడుగు కూడా
ముందుకు వేయలేకపోయింది. పరిస్థితిని గ్రహించిన రామచంద్రుడు ఒక సత్రంలో విడిదిచేశాడు. 

జ్వర తీవ్రతతో అలసిపోయి పడుకొని ఉంది శారద. అప్పుడు *నల్లటి ఆకృతి* గల ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. శారద రెప్పవాల్చకుండా ఆమెనే చూడసాగింది.ఇంతటి నలుపు రంగును ఆమె ఇంతవరకూ చూసిందిలేదు. ఆ నలుపులో కూడా ఇంత అందం ఇమిడి ఉంటుందని ఆమె అనుకోలేదు. 

తన కోమల హస్తాలతో శారద తలను, దేహాన్ని నిమిరింది. అంతే, శారద అనుభవిస్తున్న అలసట, బాధ
తొలగిపోయాయి. 'ఈమె
చేతులకు ఎంతటి అద్భుత శక్తి! అనుకొని ఆశ్చర్యపోయిన శారద, "అవును,నువ్వు ఎక్కడ నుంచి
వస్తున్నావమ్మా?" అని
అడిగింది. 

"దక్షిణేశ్వర్ నుంచి.

ఈ జవాబు విని శారద ఆశ్చర్య పోయింది.
"ఏమిటి! దక్షిణేశ్వరం నుంచా! నేను కూడా అక్కడికే వెళ్లాలి. ఆయనను చూడాలి! ఆయనకు పరిచర్యలు చేయాలి అనుకున్నాను. అంతలో ఈ దిక్కుమాలిన జ్వరం వాతపడ్డాను. నేను అనుకొన్నదంతా తారుమారైపోతుందేమో!"

"కలత చెందకు! నువ్వు తేరుకుని త్వరలో దక్షిణేశ్వరం వెళతావు. *నీ కోసమే !* 
 *ఆయనను నేను అక్కడ ఉంచాను."* 

"ఆహా! అలాగా! అలా అయితే నువ్వు మాకు ఎలాంటి బంధువువి?"

నీ సోదరిని

“ఓహో! అందుకే నువ్వు వచ్చావా?" అంటున్న శారద కళ్లు మూతలు పడ్డాయి. అలాగే నిద్రలోకి జారిపోయింది.ఉదయం నిద్ర లేచి చూచేసరికి జ్వరం బాగా తగ్గింది. నిన్నటి రోజు చూసిన దృశ్యం ఆమెలో నూతనోత్సాహం కలిగించింది. అందువలన ఉల్లాసంగా ప్రయాణం ప్రారంభించింది. అదృష్టవశాత్తూ దారిలో ఒక పల్లకి కూడా లభించింది. సుదీర్ఘ ప్రయాణం ముగిసింది. పదవలో గంగానది దాటి దక్షిణేశ్వరం చేరుకున్నప్పుడు *రాత్రి తొమ్మిది* గంటలయింది. 
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18

శారదామాత జీవితచరిత్ర🌹 Part 33

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32