శారదామాత జీవితచరిత్ర🌹 Part 37
🌺శ్రీ మాత్రే నమః🌺
🌹 *శారదామాత జీవితచరిత్ర🌹
3⃣7⃣ *వ రోజు*
*పంచ తపస్సు :--*
🌻🌻🌻🌻🌻🌻🌻
తమ కార్యాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని సముపార్జించడానికి తీవ్రమైన తపోజీవితం చేపట్టడానికి హిమాలయాలకు బయలుదేరాడు నరేంద్రుడు. సెలవు పుచ్చుకోవడానికి అతడు ఒక రోజు మాతృదేవి వద్దకు వచ్చాడు.
మాతృదేవికి ప్రణమిల్లి, "అమ్మా! నేను బయలుదేరుతున్నాను. ఒక నిజమైన మనిషిని కాగలిగితే మళ్లీ మిమ్మల్ని దర్శించుకుంటాను. లేకపోతే ఇదే ఆఖరి చూపు” అన్నాడు. నరేంద్రుని మాటలు విని హడలిపోయారు మాతృదేవి. "నాయనా!
నువ్వెందుకు అలా అంటున్నావు?" అంటూ మధ్యలోనే ఆతణ్ణి వారించారు. అందుకు నరేంద్రుడు, “అవును. నేను అలా అనివుండకూడదు. ఎందువల్లనంటే మీ కృపాకటాక్షంతో నేను త్వరలో తిరిగి వస్తాను కనుక” అని అన్నాడు. ఆతనితోపాటు గంగాధర్ కూడా వెళ్లనున్నాడు.
మాతృహృదయం నరేంద్రునికి సెలవివ్వడానికి నిరాకరించినా, కర్తవ్య నిర్వహణ దానిని అడ్డుకొంది. గంగాధర్ ని పిలిచి, *“నాయనా! నా ఐశ్వర్యాన్నే నీకు అప్పజెప్పుతున్నాను.* హిమాలయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో నీకు తెలుసు. నరేంద్రుడు ఆహారం లేకుండా బాధపడకుండా చూసుకో” అంటూ వారిని ఆశీర్వదించి పంపారు మాతృదేవి.
మాతృదేవి ప్రారంభించిన సన్న్యాసుల సంఘానికి ఒక రూపాన్నిచ్చారు. మాతృదేవి మొదటి ఘట్ట కార్యం పూర్తిఅయింది.ఇప్పుడు ఆమె మంత్రదీక్ష అనే మరొక కార్యాన్ని చేపట్టడానికి ఆయత్తమయ్యారు. అందుకు
ముందుగా తమను పంచ తపస్సు అనే కఠోర తపస్సుకు గురిచేసుకున్నారు.
పంచ తపస్సనేది ఐదు అగ్నులకు నడుమ కూర్చొని అనుష్టించే తపస్సు. చుట్టూ నాలుగు దిక్కులలోనూ ఆరు అడుగుల నడుమ, నాలుగు చోట్ల అగ్నిని రగుల్చుతారు. మండిపోయే ఎండలో ఆ అగ్నులకు నడుమ కూర్చొని తలమీద కాస్తున్న మండెటెండను ఐదవ అగ్నిగా భావించి జపం, ధ్యానం, ప్రార్థన చేస్తారు.
మాతృదేవి 1893లో ఇలాంటి కఠోర తపస్సు అనుష్టించారు. ఆమెతోపాటు యోగిన్ మా కూడా ఈ కార్యంలో పాల్గొన్నారు. మాతృదేవి కాలాంతరంలో ఈ విషయం ప్రస్తావిస్తూ ఇలా అన్నారు.
"నాలుగు వైపులా ఆరు అడుగుల దూరంలో పిడకలను పేర్చి అగ్ని ప్రజ్వలింపజేశారు. నడినెత్తిన సూర్యుని కిరణాలు పడుతూఉంటాయి. ఉదయం స్నానం ముగించుకొని అగ్ని దగ్గరికి వచ్చాను. అగ్ని ప్రజ్వలంగా మండుతూ ఉండడం చూసి కాస్త భయం వేసింది. 'ఇలా భగభగమని మండుతున్న అగ్నిలో ప్రవేశించగలనా? సూర్యుడు అస్తమించేదాకా కూర్చోగలుగుతానా?' అనుకొని తటపటాయించాను. తర్వాత మనస్సును దృఢం చేసుకుని ఆ అగ్నిజ్వాలల నడుమ వెళ్లి కూర్చొని గురుదేవుల పవిత్ర నామాన్ని జపం చేయడం ప్రారంభించగానే అగ్నితాపం మాయమైపోయింది. ఈ తపస్సును నేను ఏడు రోజులు అనుష్ఠించాను. అందువల్ల ఎరుపురంగు నా మేనిచాయ ఇలా బొగ్గులా నల్లబడిపోయింది."
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శారదామాత చరితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment