శారదామాత జీవితచరిత్ర🌹Day 38

🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ మాత్రే నమః🌺

🌹 *శారదామాత జీవితచరిత్ర🌹
 
3⃣8⃣ *వ రోజు* 

 *నరేంద్రునికి ఆశీస్సులు :--* 
🌻🌻🌻🌻🌻🌻🌻
గంగానది తీరంలో మెట్లమీద కూర్చొని ఆ నది అందాన్ని పరికిస్తున్నారు మాతృదేవి. అప్పుడు హఠాత్తుగా గురుదేవులు అక్కడ ప్రత్యక్షమై, వెనుకవైపు నుండి వస్తూ, మాతృదేవిని స్పృశిస్తూ ఆమెను క్రిందకు తోసేసేలా వెళ్లి చటుక్కున గంగలోకి దిగారు. అలా నీళ్లలోకి దిగినవారు అందులోనే కరిగిపోయారు. ఆశ్చర్యంతో మాతృదేవి ఆ చోటును అలాగే చూస్తూ కూర్చున్నారు. మరుక్షణం నరేంద్రుడు (స్వామి వివేకానంద) హఠాత్తుగా అక్కడ కనిపించాడు. అతడు ఆ నీటిని చేతులలో తీసుకుని, 'జై శ్రీ రామకృష్ణ' అంటూ అసంఖ్యాక ప్రజానీకంపై చిలకరించాడు. ఈ దృశ్యం మాతృదేవి మనస్సులో గాఢంగా నాటుకుపోయింది. ఈ దృశ్యం తర్వాత చాలాకాలం దాకా ఆమె గంగను చూసినప్పుడల్లా, అందులో పాదాలు పెట్టడం గురుదేవుల దివ్య శరీరంపై పాదాలు మోపడంలా భావించి వెనుకాడుతూ తీరంలోనే నిలబడిపోయేవారు.

ఈ దృశ్యంలోని నిజాన్ని నిరూపించడానికా అన్నట్లు నరేంద్రుని నుండి మాతృదేవికి త్వరలో ఒక ఉత్తరం వచ్చింది. అమెరికాలో జరుగనున్న సర్వమత మహాసభలో పాల్గొనడానికి తాను వెళ్లదలచుకున్నట్లూ, మాతృదేవి అభిప్రాయం కోరుతున్నట్లు వ్రాశాడు. ఇందుకు బదులు వ్రాయడానికి మాతృదేవి కించిత్తుకూడా ఆలోచించలేదు, ఆలస్యమూ చేయలేదు. మాతృదేవి! ఆశీస్సుల నందిస్తూ ఉత్తరం వ్రాశారు.

పాశ్చాత్య దేశాలలో వేదాంత దుందుభిని మ్రోగించి స్వామీజీ 1897 ఫిబ్రవరిలో మన దేశానికి తిరిగివచ్చారు. మాతృదేవిని దర్శించడానికి వచ్చారు. తన ముద్దుల తనయుణ్ణి కలుసుకున్నప్పుడు కూడా మాతృదేవి తన లజ్జా తెర నుండి బయటికి రాలేదు. శరీరమంతా కప్పుకుని గదిలో నిలబడ్డారు. ఆయనతో సూటిగా మాట్లాడకుండా గోలాప్ మా ద్వారానే మాట్లాడారు. అంటే మాతృదేవి మెల్లగా చెబితే గోలాప్ మా దానిని బిగ్గరగా స్వామీజీకి తెలియబరిచారు.

ముందుగా స్వామీజీ సాష్టాంగపడి మాతృదేవికి ప్రణమిల్లారు. స్వామీజీ, తర్వాత మాతృదేవితో గోలాప్ మా ద్వారా మాట్లాడారు.

స్వామిజీతో పాటు పాశ్చాత్య శిష్యురాండ్రయిన సోదరి నివేదిత, మిసెస్ ఓల్బుల్, మిస్. జోసఫిన్ మెక్లవుడ్ కూడా వచ్చారు. స్వామీజీ పాశ్చాత్య శిష్యురాండ్రలో పలువురు రామకృష్ణ సంఘ చరిత్రలో శాశ్వతంగా చోటుచేసుకున్నారు. వీరిలో మిసెస్ ఓల్బుల్, సోదరి నివేదిత ముఖ్యులు. ఎందుకంటే వీరిద్దరూ ప్రయత్నం చేయకుండా ఉండివుంటే మాతృదేవి ప్రారంభకాల ఛాయాచిత్రాలు మనకు లభించి ఉండేవి కావు. 

1898వ సం|| మాతృదేవి 45వ ఏట తీసిన ఛాయాచిత్రాలు ఇవి. కలకత్తాలోని నివేదిత ఇంట్లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. లజ్ఞాస్వరూపిణి అయిన మాతృదేవి ముందు ఇందుకు సమ్మతించలేదు. "నేను అమెరికా వెళ్లేటప్పుడు తీసికెళ్లి పూజించుకుంటాను” అంటూ ఓల్బుల్ ఎంతో ప్రాథేయపడడంతో ఆమె సమ్మతించారు. ఎంతో తటపటాయించిన తర్వాత అక్కడ కూర్చున్నారు మాతృదేవి. ఇదే ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం పొందిన ఛాయాచిత్రం.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చరితామృతం🌹

🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

దీపావళి అసలు ఎందుకు జరుపుకుంటారు? దీపావళి విశిష్టత ఏంటి?

భగవద్గీత అంటే ఏమిటి