శారదామాత జీవితచరిత్ర Part 10


🌺శ్రీ మాత్రే నమః🌺

 🌹 *శారదామాత జీవితచరిత్ర* 🌹

🌻🌻🌻🌻🌻🌻🌻

పడవ నుంచి దిగిన శారద పరిపరి విధాల ఆలోచిస్తూ తడబడే హృదయంతో తిన్నగా గురుదేవుల గదిలోకి వెళ్లింది. వెంట వచ్చినవారు నహబత్తుకు వెళ్లిపోయారు.

గదిలో అడుగు పెట్టింది శారద. ఆమెను చూసిన మరుక్షణం, " *అహా నువ్వు వచ్చేశావా* ! మంచిది రా! రా!' అన్నారు గురుదేవులు. ఆయన కంఠంలో వ్యక్తమైన ప్రేమ, ఆప్యాయత శారదలోని సందేహాలనన్నిటినీ పటాపంచలు చేసివేశాయి. ఆ రోజు జయరాంబాటిలో చూసిన ప్రేమమూర్తిలో ఎలాంటి మార్పూలేదు. మతి చెడిపోయిందనే మాటకే ఆస్కారం లేదని శారద గ్రహించింది.అంతలో గురుదేవులు ఎవరితోనో, "ఆమె కూర్చోవడానికి ఒక చాపపరచు" అన్నారు. శారద కూర్చున్న తర్వాత ఇంటి విశేషాలనూ, బంధువుల యోగక్షేమాలనూ విచారించారు. మాటల్లో తనకు జ్వరం వచ్చిన విషయం చెప్పింది శారద.

అది విన్న ఆయన ఎంతో ఆందోళనతో, “అయ్యో! ఇప్పుడు నా మధురబాబు బ్రతికి ఉంటేనా! మథుర్ మరణంతో నా ఎడమ చేయి పడిపోయినట్లయింది" అన్నారు.

శారద హృదయం పులకరించిపోయింది. ఆయన మాటలలోని ఆప్యాయతను చూసి ఆమెకు అమృతం గ్రోలినట్లనిపించింది. సంతోషంగా లేచిన శారద నహబత్తుకు వెళ్లడానికి ఆయత్తమయింది.

 ఆమెను వారించిన
గురుదేవులు, "వద్దు వద్దు. నువ్వు ఇక్కడే ఉండు! నహబత్తుకు డాక్టరు వచ్చి పరీక్ష చేయడం కష్టం". అంటూ ఆయన గదిలో ఉండనిచ్చారు. రాత్రి భోజనాలు పూర్తికావడం వలన హృదయ్ అందరికీ మరమరాలు మాత్రం పెట్టాడు. తర్వాత శ్రీరామకృష్ణుల గదిలోనే శారద పడుకుంది. ఆమెకు తోడుగా మరొక స్త్రీ కూడా పడుకొంది. 

ఉదయం డాక్టరు వచ్చి శారదకు మందులిచ్చాడు. ఒకటి రెండు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమె నహబత్తుకు వెళ్లి ఉండసాగింది. తన కుమార్తె ఆనందమయ జీవితాన్ని చూసిన రామచంద్రుడు తృప్తిగా జయరాంబాటికి
బయలుదేరాడు.

అప్పుడప్పుడు జయరాంబాటికి(శారద పుట్టినఊరు) వెళ్లి వచ్చిన రోజులు మినహాయిస్తే *సుమారు పదమూడేళ్లు* శారద నహబత్తులోనే గడిపిందనవచ్చు. ఆ ఇరుకు గదిలో ముడుచుకొని గురుదేవుల పరిచర్యలలో, అత్తగారికి కావలసిన సహాయాన్ని అందించడంలో
పూర్తిగా తనను తాను అర్పించుకుంది శారద.

🌻🌻🌻🌻🌻🌻🌻
     🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18

శారదామాత జీవితచరిత్ర🌹 Part 33

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32