శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 15
🌺శ్రీ మాత్రే నమః🌺
🌹 * శ్రీ శారదామాత జీవితచరిత్ర 🌹
1⃣5⃣ *వ రోజు*
*శారదామాత దినచర్య :-*
🌻🌻🌻🌻🌻🌻🌻
మధ్యమధ్యలో జయరాంబాటికి వెళ్లి కొంతకాలం అక్కడ బసచేసింది పోగా దక్షిణేశ్వరంలో శారద సుమారు *పదమూడేళ్లు* నివసించింది.
ఆమె నహబత్తులో నివసించింది. నహబత్తు అంటే వాద్యమండపం. ఆ రోజుల్లో ధ్వని పరికరాలు లేనందున ఈ మంటపం మేడ మీద కూర్చొని ఆలయ వాద్య బృందం ఉదయం, సాయంత్రాలు సంగీత వాద్యాలు వాయించేవారు.
దక్షిణేశ్వర ఆలయానికి దక్షిణ, ఉత్తరాభిముఖంగా రెండు నహబత్తులున్నాయి. మాతృదేవి నివసించింది ఉత్తరపు నహబత్తులో. ఈ భవనం నిజానికి ఎంతో చిన్నది. ఈ గదికి ఒకే ఒక తలుపు. దక్షిణాభిముఖంగా ఉండే ఈ తలుపును తెరిస్తే గురుదేవుల గది కనిపిస్తుంది. ఆయన గదికి
ఉత్తరాభిముఖంగా ఉండే తలుపు
తెరిస్తే అక్కడ జరిగేవన్నీ నహబత్తు నుండి చూడవచ్చు. నహబత్తుకు చుట్టూ ఉన్న వెలుపలి వసారాలో తూర్పున మేడ పైకి వెళ్లడానికి మెట్లున్నాయి. ఈ మెట్లు క్రింది భాగం మాతృదేవి వంటగది, మేడ పైన
గురుదేవుల తల్లి
నివసిస్తున్నారు. దిగువన మాతృదేవి ఉంటున్నారు.
మాతృదేవి వసించే గదిలో వసతులు బాగా తక్కువ. ఆ గదిలో కాళ్లు బాగా చాచి పడుకోవడం కూడా కష్టమే. ఇది చాలదన్నట్లు, బియ్యం, పప్పుబస్తాలు, కూరగాయల మూటలు అన్నీ అక్కడే నిల్వ చేసేవారు. ఇంకా గురుదేవుల కోసం
ఆహారం ఉంచిన కడవలున్న ఉట్లు పైనుండి వేలాడుతుంటాయి.
మాతృదేవి ఏకాంత జీవితంకోసం వసారా చుట్టూ మనిషి ఎత్తువరకు తడికలు కట్టి ఉంచారు. ఇందువల్ల సూర్యరశ్మి లోపలికిరాదు.
నహబత్తులో ఉంటూ అత్యంత శ్రమతో కూడిన పని ఏమిటో తెలుసా? స్నానం చేయడమూ, కాలకృత్యాలు తీర్చుకోవడమూ!
నహబత్తులో మాతృదేవి జీవితం *ప్రతి రోజు ఉదయం* *మూడు గంటలకే* ప్రారంభమయ్యేది. అందరూ నిద్రిస్తూవున్న అతి
వేకువ జామునే లేచి గంగానదిలో స్నానం చేసి, జన సంచారం ప్రారంభమవడానికి మునుపే గదికి తిరిగి వచ్చేసేవారు. తర్వాత *ధ్యానం* చేయడానికి కూర్చునేవారు. ధ్యానం ముగిసిన తర్వాత *పూజ,* *జపం* మొదలుపెట్టేవారు. అన్నీ పూర్తి కావడానికి ఒకటిన్నర గంట పట్టేది.
ఆ తర్వాత మెట్ల క్రింద వంట ప్రారంబించేవారు. వంట పూర్తిచేశాక అవకాశం దొరికితే గురుదేవులు స్నానం చేయడానికి ముందుగా ఆయన శరీరానికి నూనె రాసేవారు. ఆయన స్నానానికి వెళ్లిన తర్వాత ఆయన కోసం తమలపాకుల చిలకలు సిద్ధం చేసేవారు.
గురుదేవులు స్నానం చేసి రాగానే కూర్చోవడానికి ఆసనం పరిచేవారు. ఆయన ఉదయం పదిన్నర గంటల నుండి పదకొండు గంటల లోపుగా భోజనానికి కూర్చోనేవారు.
మాతృదేవి పళ్లెంలో ఆహారం తీసుకువచ్చి, గురుదేవులకు వడ్డించి, ప్రక్కనే కూర్చొని మాట్లాడుతుండేవారు. ఆయన హఠాత్తుగా ఉన్నత *పారవశ్య స్థితి*
లోకి వెళ్లిపోకుండా జాగ్రత్త వహించేవారు. ఈ విషయంలో మాతృదేవికి ఎవరూ సాటిరారు. గురుదేవులు భోజనం చేసిన తర్వాత తాను కూడా ఆదరాబాదరాగా ఏదో
కాస్త తిని, కాసిని నీళ్లు తాగేవారు. తర్వాత మళ్లీ తమలపాకు చిలుకలు తయారుచేసేవారు. అలాంటి సమయాల్లో చక్కటి స్వరంతో పాడేవారు. మాతృదేవి కంఠం పుష్పాలు రాలినట్లు మృదుమధురంగా ఉండేది. అయినా ఆమె పాడేటప్పుడు ఎవరూ వినకూడదనే విషయంలో చాలా జాగ్రత్తపడేవారు.
ఇంతలో ప్రక్కన నెలకొన్న కర్మాగారం నుండి *మధ్యాహ్నం* ఒక గంటకు గంట వినవచ్చేది. ఆ తర్వాత భోజనానికి కూర్చునేవారు. భోజనం ముగిసేటప్పటికి ఒకటిన్నర అయ్యేది. తర్వాత కాసేపు విశ్రాంతి. మధ్యాహ్నం సుమారు మూడు
గంటలకు ఆరు బయట కూర్చొని శిరోజాలను ఆరబెట్టుకొనేవారు.ఆమె కురులు ఒత్తుగా,నల్లగా మోకాళ్లవరకు ఉంటాయి.
తర్వాత *సాయంకాలం* పనులు ప్రారంభమయ్యేవి. ఆ తర్వాత నహబత్తులో నిల్వవుంచిన నీళ్లతో ముఖం కడుగుకొని, బట్టలను కూడ తడిపి పెట్టేవారు. *సంధ్యాసమయానికి* దీపాలను వెలిగించి దేవుని పటాలకు *ధూపం* చూపించేవారు. తర్వాత *ధ్యానానికి* కూర్చునేవారు. తదనంతరం రాత్రికి వంట చేసేవారు. అందరూ భోజనం చేసిన తరువాత ఆమె తినేవారు. కొంతసేపు పడుకునేవారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments
Post a Comment