శారదామాత జీవితచరిత్ర Part 28
🌻🌻🌻🌻🌻🌻🌻
🌸శ్రీ మాత్రే నమః🌸
2⃣8⃣ *వ రోజు*
*కార్యాన్ని అప్పచెప్పడం:-*
🌻🌻🌻🌻🌻🌻🌻
ఈ యువకులను ఎవరి బాధ్యతలో వదలి వెళ్లగలరు?
*“వీరందరి బాధ్యతలను*
*నేను స్వీకరిస్తాను”* అంటూ దక్షిణేశ్వరం రోజులలోనే ఆయనతో చెప్పిన *మాతృదేవికి* తప్ప మరెవరికి అప్పజెప్పి వెళ్లగలరు? దక్షిణేశ్వరం వదలి ఎప్పుడు గురుదేవులు వెళ్లారో అప్పటి నుండి జరగరానిది జరిగిపోతుందేమో !ఆ వ్యాకులతతో ఆమె జీవిస్తున్నారు.
గురుదేవులకు గొంతులో వ్రనం రావడం ఇందుకు కారణమని చెప్పలేం. తమ నిర్యాణ సమయానికి సూచనలు అంటూ గురుదేవులు చెప్పిన మాటలు ఒకటి తర్వాత మరొకటిగా జరగడం ప్రారంభమవడమే మాతృదేవి హృదయాన్ని కలచివేయసాగింది.
*ఐదవ ఏట* పాణిగ్రహణం చేసి తనను *భార్యగా, శిష్యురాలిగా, కుమార్తెగా, అంతెందుకు తల్లిగా* కూడా ఆదరించి నిస్వార్థ ప్రేమతో లాలిస్తున్న ఆ ప్రేమమూర్తి నిష్క్రమింపనున్నారా? మాతృదేవి ఆవేదన జ్వాలగా హృదయం లోపల దహింపసాగింది.
గొంతులో వ్రణం రావడానికి నాలుగైదు సం||లకు మునుపే గురుదేవులు మాతృదేవితో, " *ఎప్పుడు విచక్షణారహితంగా ఎవరు ఇచ్చిన ఆహారాన్ని అయినా సరే తీసుకుంటానో, ఎప్పుడు రాత్రుళ్లు కలకత్తాలో గడుపుతానో, ఎప్పుడు ఆహారంలో కొంత భాగాన్ని ఇతరుల కిచ్చి మిగిలిన దానిని తీసుకుంటానో, అప్పుడు నేను నిష్క్రమించే రోజు దూరంలో లేదని తెలుసుకో”* అని చెప్పారు.
గొంతులో వ్రణం రావడానికి కొంతకాలం ముందు నుండి ఇలాగే జరగసాగింది. కలకత్తాలో పలుచోట్ల పలువురు భక్తుల ఆహ్వానాన్ని మన్నించి వారి ఇళ్లకు వెళ్లిన గురుదేవులు, అన్నం మినహాయించి తక్కిన అన్ని రకాల ఆహారాన్ని అందరి వద్ద నుండి స్వీకరించసాగారు. అనుకోకుండా బలరాం ఇంట్లో అప్పుడప్పుడు రాత్రుళ్లు గడపడం కూడా జరిగింది. ఒక రోజు తమకంటూ ప్రత్యేకంగా వండిన అన్నాన్ని ముందుగా నరేంద్రునికిచ్చి(స్వామి వివేకానంద) మిగిలిన అన్నం తాను తిన్నారు. మాతృదేవి దానిని వారించినప్పుడు; ఆయన, “మొదట నరేంద్రునికి ఇవ్వడంలో నా మనసులో ఎలాంటి నిర్బంధమూ కలుగలేదు. అందులో దోషం కూడా లేదు" అన్నారు. "గురుదేవులు ఇలా అన్నప్పటికీ, ఆయన ముందు చెప్పిన దాన్ని గురించి ఆలోచించి నేను మనశ్శాంతి కోల్పోయాను" అంటూ కాలాంతరంలో మాతృదేవి అన్నారు.
శ్యాంపుకూర్ రోజుల్లో దక్షిణేశ్వరంలో జరిగిన ఒక సంఘటన మాతృదేవి మనస్సును ఇంకా కలతపెట్టసాగింది. తమ నిర్యాణ సమయానికి మరొక సూచనగా, “నన్ను ఎప్పుడు భక్తులు *దైవంగా* ఆరాధించడం మొదలుపెడతారో అప్పుడు నా నిర్యాణ సమయం ఆసన్నమయిందని గ్రహించుకో" అంటూ గురుదవులు చెప్పివున్నారు. అది కూడా జరిగింది.
ఆయన చికిత్సకోసం కలకత్తా వెళ్లారని తెలియని భక్తులు కొందరు దక్షిణేశ్వరం వెళ్లి విషయం తెలుసుకొన్నప్పుడు వారికి చెప్పలేనంత బాధ కలిగింది. భక్తులు ఆయన గదికి వెళ్లి ఆయన చిత్రపటం ముందు తాము తెచ్చిన తీపిపదార్థాలు నైవేద్యంగా ఆయనకు అర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించారు. ఈ సంఘటన విన్నప్పుడు మాతృదేవి ఎంతో కలత చెందారు. గురుదేవులు ఆమెను ఓదారుస్తూ, “దీనికోసం ఎందుకిలా కలవరపడుతున్నావు? కాలక్రమంలో నన్ను ప్రతి ఇంటా ఆరాధిస్తారు. ఇది సత్యం. కనుక కలత చెందకు" అన్నారు. మాతృదేవి మనస్సు సాంత్వన పొందలేదు. అంతే కాకుండా శ్యాంపుకూర్లో ఒకసారి కాళీ పూజ రోజు భక్తులు గురుదేవులను *కాళీమాతగా* పూజించారు. వీటినన్నిటిని తలచుకొని మాతృదేవి మనస్సు తీరని ఆవేదనకు గురైంది.
ఒక రోజు గురుదేవులు మాతృదేవిని చాలా సేపు తేరిపార చూస్తూనే కూర్చోన్నారు. అది గమనించిన మాతృదేవి, “ఏమైనా చెప్పదలచుకున్నారా? చెప్పండి అన్నారు.
అందుకు గురుదేవులు,
“నువ్వు ఏమీ చేయవా? అన్నీ నేనే చేయాలా?" అని అడిగారు.
అందుకు మాతృదేవి, "నేనొక స్త్రీని. నేనేం చేయగలను?” అని ఎదురుప్రశ్న వేశారు.
"నువ్వు చేసే తీరాలి. నువ్వు చేయాల్సింది చాలా వుంది" అన్నారు.
ఇలా గురుదేవులు తమకు కార్యాన్ని అప్పగించడంలోని అర్థం మాతృదేవికి బాగా తెలుసు కాబట్టి ప్రత్యుత్తర మివ్వకుండా, మౌనం వహించారు.
"ప్రజలు అజ్ఞానమనే అంధకారంలో కీటకాల్లా కొట్టుమిట్టాడుతున్నారు. వారిని నువ్వు ఆదుకునే తీరాలి” అన్నారు గురుదేవులు.
ఈ సంఘటన తర్వాత తమ భక్తురాండ్రను, లాటు, యోగిన్, రాఖాల్, నరేంద్రుడు ఇత్యాది కొందరు భక్తులను యువకులను చేరదీసి సన్యాస సంఘాన్ని రూపొందించిన గురుదేవులు వారిని మాతృదేవికి అప్పగించి ఆమెను
*"సంఘ జనని"* గా తీర్చిదిద్దారు. దీనినే కాలాంతరంలో ఉద్వేగపూరితంగా
*వివేకానంద స్వామి,* “గురుదేవుల ఆదర్శాలను స్వీకరించి మేం కొందరు యువకులం ఆ మేరకు జీవించసాగాం. మమ్మల్ని సమాజం నిరసించింది, ఎదుర్కొంది, ఆ సమయంలో మాకు ఆశాజ్యోతిగా కానవచ్చింది ఒక్కరే ఒక్కరు. వారు ఒక స్త్రీ అవును, మాతృదేవి మాత్రమే మాకు *అశ్రితురాలుగా, స్వాంతన నిచ్చే తల్లిగా ఉన్నారు"* అని చెప్పారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
శ్రీ శారదామాత చరితామృతం
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment