శారదామాత జీవితచరిత్ర Part 39
🌺శ్రీ మాత్రే నమః🌺
🌹 *శారదామాత జీవితచరిత్ర* 🌹
3⃣9⃣ *వ రోజు*
*కుటుంబ పెద్దగా బాధ్యత :-*
🌻🌻🌻🌻🌻🌻🌻
కత్తాలోని కోలాహలంలో ఇరుకైన స్థలాలలో నివసించడం చెరసాలలో ఉన్నట్లే ఉండేది మాతృదేవికి. కలకత్తా చెరసాల నుండి బయటపడి జయరాంబారికి వచ్చాకే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ఆ ప్రాంతాలలో మలేరియా వ్యాధి శాశ్వతంగా ప్రబలి ఉంది. దాన్ని మాతృదేవి ఖాతరు చేయలేదు.
మాతృదేవి కామార్పుకూర్ లో పడుతున్న కష్టాలను చూడలేక ఆమె తల్లి జయరాంబాటి రావసలసిందని ఒత్తిడి కారణంగా,మరి కొన్ని కారణాల వలన జయరాంబాటిని స్థిరనివాసంగా ఏర్పరచుకున్నారు.
మాతృదేవి తమతోపాటు జయరాంబాటి గ్రామంలో నివసించడం ప్రజలకు ఒక మధురానుభవం. దానితోపాటు మాతృదేవి దర్శనార్థం భక్తులు రావడంవల్ల పండ్లు, కూరగాయలు, పాలు, చేపలు ఇత్యాదుల వ్యాపారం బాగా పెరిగిపోయింది. గ్రామస్తుల పేదరికానికి గుడ్డిలో మెల్లగా అమరింది. కరుణాస్వరూపిణి అయిన మాతృదేవి ఈ కారణం వల్ల కూడా గ్రామంలో జీవించగోరి ఉండవచ్చు.
మాతృదేవికి ఐదుగురు తమ్ముళ్లు, చెల్లెలు కాదింబిని ఉండేవారు. ఇందులో కాదంబిని, ఇద్దరు తమ్ముళ్లు యువ ప్రాయంలోనే మరణించారు. మాతృదేవియే ఇంటికి పెద్దవారు. సోదరులందరూ ఆధ్యాత్మిక వాసనే లేకుండా కేవలం ప్రాపంచిక వ్యక్తులలా జీవితం గడిపారు. మాతృదేవి తన సోదరుల యోగక్షేమాలలో ఎంతో అక్కర చూపారు. వారందరూ పెరిగి పెద్దవారై పలువురు బిడ్డలకు తండ్రులయిన తర్వాత కూడా ప్రతి విషయానికి మాతృదేవి పైనే ఆధారపడసాగారు. తమ బిడ్డలయిన భక్తులు,శిష్యులూ పంపించే అనేక వస్తువులతో పాటు, డబ్బును అపహరించడంలోనే వారు శ్రద్ద చూపారు. అందుకోసం పరస్పరం పోట్లాడుకుంటూ మాతృదేవికి అంతులేని ఆవేదన, ఇబ్బంది కలిగించారు. శ్యామసుందరి (మాతృదేవి తల్లి) వృద్ధురాలు. అందువల్ల మాతృదేవి ఆమెను ఏ పని చేయనివ్వలేదు. ఆమె మరదళ్ళు చిన్నవారు కాబట్టి సక్రమంగా ఇంటి పనులు చేసుకోవడం వారికి చేతకాలేదు. అందువల్ల ధాన్యం దంచడం మొదలు సోదరుల బిడ్డలకు స్నానాలు చేయించి, అన్నం తినిపించడం దాకా అన్ని పనులు మాతృదేవియే చేసేవారు. మరదళ్లు కూడా ఒకరికొకరు తీసిపోలేదు. కానుకలన్నీ తమకే చెందాలని పోటాపోటీలు, కొట్లాటలు. వారందరిని తృప్తి పరచడానికి మాతృదేవి వహించిన సహనం వర్ణనాతీతం. ఎల్లలెరుగని సహనంతో ఈ ఆవేదనల నన్నిటినీ ప్రశాంతంగా భరించారు.
"భూమి కున్నంత ఓర్పు మనకుండాలి, ఇతరుల దోషాలను సహించాలి, పురుషులు సైతం దీనిని పాటించాలి” అంటూ మాతృదేవి తరచు చెప్పేవారు. ఓర్పు హద్దులు మీరినప్పుడు, "ఒక బురద గుంటలో తామర పుష్పంలా జీవిస్తున్నాను" అనేవారు.
ఈ లోకంలో ఆచరించవలసిన కార్యాలన్నింటిని దాని మూలంగా పూర్తిచేసి తర్వాత మాయను వదలుకుంటారు. అలా మాతృదేవి జీవితంలో వచ్చిన *యోగమాయే 'రాధు'.*
మాతృదేవి చివరి తమ్ముడు అభయచరణ్ కుమార్తె రాధు. అభయ్ కలకత్తాలో వైద్యశాస్త్రం చదువుతున్నప్పుడు, 1899 వ సం||లో హఠాత్తుగా కలరావ్యాధి సోకి మరణించాడు. అప్పుడు ఆతడి భార్య *సురబాల* గర్భిణి. మరణశయ్యపై అభయ్ తన భార్యను, పుట్టబోయే బిడ్డను చూసుకోమని మాతృదేవి చేతులు పట్టుకుని విలపిస్తూ అభ్యర్థించాడు. అందువల్ల తమ్ముని అభ్యర్థనను అంగీకరించారు. అభయ్ మరణించాడు. చిన్నతనంలోనే ఒక బిడ్డకు తల్లియై ఆ బిడ్డ పుట్టడానికి మునుపే భర్తను కోల్పోయి వితంతువయిన సురబాలను చూస్తే ఆమెకు ఆవేదన ఎక్కువయింది. సులబాలను పెంచిన అమ్మమ్మ, అత్త ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. వరుసగా ఇన్ని దుఃఖాలకు గురియైన సురబాల స్థిమితంగా ఉండలేకపోయింది. ఆమెకు మతి చలించి పిచ్చిదయిపోయింది. ఈ పరిస్థితిలో 1900 ఫిబ్రవరిలో ఆమె ఒక ఆడ శిశువును ప్రసవించింది.ఆమె పేరు రాధారాణి.ముద్దుగా *'రాధు'* అని పిలిచేవారు. పిచ్చి దానికి పుట్టిన బిడ్డను ఎవరు పోషిస్తారనేది పెద్ద సమస్య అయింది. మరణం సమయంలో తమ్ముడి కిచ్చిన మాటా, ప్రస్తుతం ఆతని భార్య అనాథగా పిచ్చి దానిగా తిరుగుతూ ఉండడమూ, ఆమెకు పుట్టిన బిడ్డను చూసుకొనేవారు లేకపోవడాన్ని మాతృదేవి చూశారు. అందుకోసం మాతృదేవియే వారి భాద్యత తీసుకున్నారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment