శారదామాత జీవితచరిత్ర Part 4
🌸శ్రీ మాత్రే నమః🌸
🌹 శారదామాత జీవితచరిత్ర 🌹
పార్ట్ 4
బాల్యం-విద్యాబ్యాసం .
🌻🌻🌻🌻🌻🌻🌻
పేదకుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మించినందున చిన్నతనం నుండే తల్లికి వంటపనిలో సాయం చేయడం, చెల్లి తమ్ముళ్ల ఆలనాపాలనా, తండ్రి పత్తి పండించేవాడు కాబట్టి పత్తిపంట పొలానికి వెళ్లి తండ్రికి భోజనమిచ్చి ప్రత్తి కాయలు సేకరించి జంధ్యాలు వడకి అమ్మడంలో తల్లిదండ్రులకు సహాయపడేది.ఇంకా వడ్లుడంచడం పశువులకు గ్రాసం పెట్టడం,చెరువుకు వెళ్లి నీళ్లు తీసుకువచ్చేది. పనిలోపనిగా ఈత కూడా నేర్చుకొంది.
శారద నిర్వర్తించే ఈ పనులు ,వయస్సుకు మించిన బాధ్యత వహించడం, కొన్ని సమయాలలో ఇంటిల్లపాదికి ఆశ్చర్యం కలిగించేవి.స్త్రీలు పాఠశాలకు వెళ్లడం అపరాధంగా పరిగణించబడే ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకోవాలని ధైర్యంగా ప్రయత్నించింది శారద. చెల్లిని తమ్ముళ్లను చూసుకోవడం, ఇంటిపనులతోనే ఆమె కాలమంతా గడిచిపోయింది. లభించే ఏ స్వల్ప వ్యవధిలోనే తమ్ముళ్ళతో వీధిబడికి వెళ్ళేది. కానీ అది కూడా
కొద్దిరోజులు మాత్రమే.
ఆడుకునేటప్పుడు ఇతర పిల్లలతో పోట్లాడడం, తగాదా పడడం ఇలాంటి గుణాలు ఆమెలో మచ్చుకైనా లేవు. ఇతరులు పోట్లాడుకోవడం చూస్తే వారిమధ్య రాజిచేసేది.
*కాళీ,శ్రీ మహాలక్ష్మి* లు ఆమెకు నచ్చిన దేవతలు. బంకమట్టితో ఆ దేవతల ప్రతిమలను చేసి పువ్వులతో వాటిని అలంకరించి నిండు మనసుతో ఆమె పూజ చేయడం కన్నుల పండుగగా ఉండేది. ఒకసారి ఈ విధంగా పూజ చేస్తూ బాహ్య ప్రపంచాన్ని విస్మరించి చాలాసేపు అలాగే కూర్చుండి పోవడం తటస్థించింది.
ఆమెతో ఎవరూ, “ఇది చేయి, అది చేయి” అని చెప్పాల్సిన పనే లేదు.చేయవలసినదంతా ఆమె గమనించి బాధ్యతాయుతంగా చేసుకుపోయేది. ఇది శ్యామసుందరికి ఎంతో గర్వ కారణం."ఈమె మాత్రం ఈ రకంగా ఉండనట్లయితే పని, పిల్లలు అంటూ నేను ఎంతగా అల్లాడిపోయేదాన్నో! కుమార్తె అంటే కుమార్తె” అని చెప్పుకొని గర్వపడేది.
చిన్నతనంలో ఇన్ని పనులు ఎలా చేయగలిగారు అని కాలాంతరంలో మాతృదేవిని అడిగినప్పుడు ఆమె ఇలా సెలవిచ్చారు.నా చిన్నతనంలో అచ్చం *నాలాంటి ఒక బాలిక* ఎప్పుడు నాతో ఉండేది. నేను వెళ్లిన ప్రతి చోటికి ఆమె కూడా నాతో వచ్చేది. నా పనులలో పూర్తిగా నాకు సహాయం చేసేది .నాకు *పది సంవత్సరాలు* వచ్చేవరకు ఇలా జరుగుతూ ఉండేది.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ శారదామాత చరితాంమృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments
Post a Comment