శారదామాత జీవితచరిత్ర Part 5
🌸శ్రీ మాత్రే నమః🌸
🌹 *శారదామాత జీవితచరిత్ర* 🌹
Part 5
వివాహం:-
🌻🌻🌻🌻🌻🌻🌻
శ్రీ శారదా-రామకృష్ణుల వివాహం ఒక దివ్య నాటకానికి నాంది. విషయ సుఖము, పుత్ర ప్రాప్తియో ఈ వివాహలక్ష్యం కాబోదు, కాదు కూడా. ఎందుకంటే వివాహ సమయంలో శారద వయస్సు కేవలం *ఐదేళ్లు* కనుక! ప్రేమ, కామము అనే విషయాలే అర్థం కాని లేత వయస్సు. ఇక శ్రీరామకృష్ణులో శరీరం,హృదయం, ప్రాణం యావత్తునూ దేవి పాదపద్మాలలో సమర్పించి, ఆమె సాక్షాత్కార భాగ్యం పొందినవారు. ఆ దేవిని తప్ప దేనినీ ఆశించనివారు. అందువల్ల *ఉన్నత ఆదర్శాల కోసం ఈ వివాహం జరిగి ఉండాలి.*
🌼🌸🌼🌸🌼🌸🌼
శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూరుకూ, శారదామత జన్మస్థలమైన జయరాంబాటికీ దగ్గర
లోని గ్రామం సిహోర్. అక్కడి శాంతినాథ్ శివాలయంలో ఉత్సవాలకు కామార్పుకూరు, జయరాంబాటి లాంటి సమీప గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చేవారు. అలాంటి ఒక సందర్భంలో
జయరాంబాటి నుండి శారద కుటుంబం, చిన్నారి శారదతో ఈ ఉత్సవానికి రావడం తటస్థించింది.
🌸🌼🌸🌼🌸🌼🌸
అప్పుడు బంధువైన ఒక వృద్ధురాలు శారదను తన ఒళ్లో కూర్చోపెట్టుకుని మామూలుగా ముసలమ్మలు ప్రశ్నించేలా, “అమ్మ! శారదా! నువ్వు ఎవరిని
కట్టుకుంటావమ్మా?"అని అడిగింది. చిన్నారి శారద ఆ ప్రశ్నలు ఎలా అర్థంచేసుకుందో మనకు తెలియదు. కానీ తన లేత చేతులను చాపి ఆ గుంపులోని ఒక యువకుణ్ణి చూపించింది. అంతే - ప్రశ్న అడిగిన ముసలమ్మకు ఎందుకు అడిగానా అనిపించింది. ఎందుకంటే ఆమె సూచించింది మరెవ్వరినో కాదు - సాక్షాత్తూ శ్రీరామకృష్ణులనే!
ఆ రోజుల్లో ఆయన లౌకికుల దృష్టిలో ' *పిచ్చి గదాయ్* 'గా కనబడ్డారు.బ్రతకడం నేర్వని అమాయకుడు. హఠాత్తుగా ధరించిన గుడ్డలను తీసివేసి తిరుగుతూండేవారు. హఠాత్తుగా 'అమ్మా! అమ్మా!' అంటూ ఆక్రోశిస్తారు. నేలమీద పడి దొర్లి, ముఖాన్ని నేలకేసి
రాసుకుంటూండేవారు. మొత్తానికి పిచ్చివానిలా జీవించే ఒక వ్యక్తిని ఈ చిన్నారి చూపించిందే అని అందరూ బాధ పడ్డారు.
శ్రీరామకృష్ణుల జీవితంలో *ఇరవయ్యో ఏట నుండి ముప్పై ఒకటో* *ఏడుదాకా (1856-1867) సాధన కాలంగా పేర్కొంటారు.* ఈ కాలఘట్టంలో ఆయన ఆధ్యాత్మిక తుఫానులో చిక్కి
అల్లల్లాడిపోయారనే చెప్పాలి. బాహ్య జీవితమనేది ఒకటి ఉందనే ధ్యాస కూడా లేకుండా పోయింది. సదా సర్వవేళలా ఆయన జగజ్జననితోపాటు జీవించారు. ఒక్క క్షణం కూడా ఆమెను వదిలి
ఉండలేకపోయారు. నేల మీద పడి దొర్లి 'అమ్మా, అమ్మా' అని ఆక్రోశించేవారు.మళ్లీ జగజ్జనని దర్శనం లభించేదాకా, ఆమె వచ్చి తనను ఒడిలోకి తీసుకునే దాకా విలపించేవారు. వారి ఆంతరిక జీవితాన్ని చూడజాలని సామాన్యులు ఆ బాహ్య జీవితాన్ని చూసి, ఆయన పిచ్చివాడని తీర్మానించారు.
ఈ వార్త కామార్పుకూరులో శ్రీరామకృష్ణుల తల్లి అయిన *చంద్రమణీదేవికి* అందింది. ఈ వృద్ధాప్యంలో తన
అనుంగు బిడ్డను గురించిన ఈ వార్త ఆమెను క్రుంగతీసింది. వెంటనే శ్రీరామకృష్ణులను కామార్పుకూరుకు రప్పించి రకరకాల చికిత్సలు చేయించింది.
కామార్పుకూరుకు వచ్చిన తర్వాత ఆయన దివ్యోన్మాదం కొంతఉపశమించింది.ఆయను
ఈ మామూలు స్థితిలోనే నిలుపుకోవాలంటే ప్రాపంచిక బంధంతో ముడివేయాలి. అందుకు వివాహం ఒక్కటే తరుణోపాయమని తల్లీ, బంధువులు తీర్మానించారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ శారదామాత చరితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments
Post a Comment